14 రీల్స్‌ దుఖాణం ఇంకా మూసేయలేదా?

14 reels entertainment start Sharwanand and Vijay devarakonda new movies

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుతో వరుసగా బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లు నిర్మించి, ఆ తర్వాత వరుసగా అట్టర్‌ ఫ్లాప్‌లను కూడా నిర్మించిన 14 రీల్స్‌ బ్యానర్‌ ఇటీవల చిన్న సినిమాలకు పరిమితం అయ్యింది. రెండు మూడు సంవత్సరాలుగా పెద్ద బడ్జెట్‌ సినిమాలకు వెళ్లని ఈ నిర్మాతలు నితిన్‌, హనురాఘవపూడిల కాంబోలో ‘లై’ అనే చిత్రాన్ని నిర్మించింది. చిన్న హీరో, కొత్త దర్శకుడు అనే విషయాలను మర్చిపోయారో లేక మరేంటో కాని ఏకంగా 40 కోట్లకు పైగా బడ్జెట్‌ పెట్టారట. సోషల్‌ మీడియాలో అంతకంటే ఎక్కువ అని కూడా ప్రచారం జరుగుతుంది. నితిన్‌ వంటి హీరోకు 10 నుండి 15 కోట్లు ఎక్కువ. 20 కోట్లు అంటే చాలా ఎక్కువ. అలాంటిది ఏకంగా 40 కోట్లు పెట్టి ‘లై’ సినిమాను నిర్మించారు.

ముందు నుండి అంతా కూడా ఈ సినిమా అంత వసూళ్లు చేయగుగుతుందా అనుకున్నారు. అంతా అన్నట్లుగానే ఈ సినిమా అంత వసూళ్లు చేయలేదు, కనీసం కొంత అయినా వసూళ్లు చేయడంలో విఫలం అయ్యింది. లాంగ్‌ రన్‌లో ప్రపంచ వ్యాప్తంగా ‘లై’ సినిమా 10 కోట్ల లోపు వసూళ్లను మాత్రమే నమోదు చేయగలిగింది. ఈ చిత్రంతో నిర్మాతలకు దాదాపు 25 కోట్ల నష్టం వచ్చినట్లుగా ట్రేడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అంతటి లాస్‌ వచ్చిన తర్వాత 14 రీల్స్‌ దుఖాణం మూసేయడం ఖాయం లేదా, కొంత గ్యాప్‌ ఇవ్వడం పక్కా అని అంతా అనుకున్నారు. కాని 14 రీల్స్‌ వెంటనే మరో సినిమాను స్టార్ట్‌ చేసేందుకు సిద్దం అయ్యింది. శర్వానంద్‌తో కొత్త దర్శకుడు ఒక సినిమాను ప్లాన్‌ చేస్తున్నాడు. ఆ సినిమాను 14 రీల్స్‌ బ్యానర్‌ నిర్మిస్తుంది. శర్వానంద్‌ సినిమాతో పాటు విజయ్‌ దేవరకొండ సినిమాను కూడా ఈ నిర్మాతలు నిర్మించేందుకు సిద్దం అయ్యారు. అర్జున్‌ రెడ్డితో స్టార్‌ అయిన విజయ్‌కి పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే సంవత్సరంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ రెండు సినిమాలు సక్సెస్‌ అయితే పర్వాలేదు, లేదంటే 14 రీల్స్‌ దుఖాణం అప్పుడు మూతపడుతుందేమో చూడాలి.