హర్యానాలో దారుణం ఘటన చోటు చేసుకుంది. సీబీఎస్ఈ బోర్డు పరీక్షల్లో టాపర్ గా నిలిచి, రాష్ట్రపతి అవార్డును అందుకున్న ఓ చదువుల యువతీ జీవితాన్ని కామాంధులు చిదిమేశారు. హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాలో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం డిగ్రీ సెకండియర్ చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థిని, కోచింగ్ సెంటరుకు వెళ్లి వస్తున్న సమయంలో రెవారీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఓ కారులో వచ్చిన ముగ్గురు నిందితులు, ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించుకుని, పొలంలోకి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు. స్పృహ తప్పిన యువతిని, బస్టాండ్ సమీపంలో పారేసి వెళ్లిపోయారు. వీరంతా తమ గ్రామానికి చెందిన వారేనని గుర్తించిన యువతి, తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు వెలుగులోకి వచ్చింది.
ఈ కేసులో ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేసి విచారణ ప్రారంభించామని ఓ పోలీసు అధికారి తెలిపారు. నేరం జరిగిన ప్రాంత పరిధిలోని పోలీసు స్టేషన్ లో కాకుండా, మరో ప్రాంత స్టేషన్ లో నమోదయ్యే ఎఫ్ఐఆర్ ను జీరో ఎఫ్ఐఆర్ అంటారన్న సంగతి తెలిసిందే. ఆపై దీన్ని సదరు నేరం జరిగిన ప్రాంత పీఎస్ కు బదిలీ చేస్తారు. తమ ఫిర్యాదును తీసుకోవడానికి ఘటన జరిగిన చోట పోలీసులు నిరాకరించారని, ఒక పోలీసు స్టేషన్ నుంచి మరో పోలీసు స్టేషన్ కు తాము పరుగులు పెట్టాల్సి వచ్చిందని బాధితురాలి తల్లిదండ్రులు అంటున్నారు.