తెలుగు టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో ఒక్కొక్క విషయాలు బయటపడుతున్నాయి. ప్రేమ వ్యవహారమే ఝాన్సీ ఆత్మహత్యకు కారణమని నిర్ధారించిన పోలీసులు ఝాన్సీ రెండు ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒక ఫోన్ లాక్ ఓపెన్ కాగా అందులో ఉన్న మెసేజ్‌ల్లో కొన్ని ఆమె ప్రియుడు సూర్య తేజకు పంపి తిరిగి డిలీట్ చేసినట్లు గుర్తించారు. ఆమె సెల్‌ఫోన్ డేటాను పరిశీలిస్తున్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు సూర్యకు ఝాన్సీ మూడుసార్లు ఫోన్ చేసినట్లు గుర్తించారు. ఉదయం ఆరు గంటలకు, పదిగంటలకు, మధ్యాహ్నం మూడుగంటలకు సూర్యతో ఝాన్సీ ఫోన్లో మాట్లాడినట్లు తేల్చారు. మొత్తంగా ఇద్దరి మధ్య పదినిమిషాల పాటు సంభాషణ జరిగింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు ఝాన్సీ ఫోన్ ద్వారా తెలుసుకున్నారు. దీనిని బట్టి ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఝాన్సీ శాంసంగ్‌తో పాటు ఐఫోన్ కూడా వాడుతుంది.
దీంతో శాంసంగ్ ఫోన్ లాక్ తెరిచిన పోలీసులు ఈ డేటాను కలక్ట్ చేశారు. ఐఫోన్ అన్‌లాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే శాంసంగ్ ఫోన్లో ఆత్మహత్యకు ముందు ఝాన్సీ తీసుకున్న ఎలాంటి సెల్ఫీ వీడియో దొరకలేదు. అయితే ఐఫోన్లో ఏమైనా సమాచారం దొరికే అవకాశాలున్నయని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు అంత్యక్రియల కోసం స్వగ్రామానికి వెళ్లిన ఝాన్సీ కుటుంబసభ్యుల్ని విచారణ కోసం నగరానికి రావాలని తెలిపారు. డిలీట్ చేసిన మెసేజ్‌లను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తిరిగి అందుబాటు లోకి తెచ్చేందుకు పంజగుట్ట పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆమె రెండో ఫోన్ ఐఫోన్ లాక్ చేస్తే తప్ప ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరావని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. కాగా.. గత నెలలో కూడా ఒకసారి ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.