మోడీ ప్రభుత్వానికి బయట వారినుండి ఏమో గానే తమ సొంత పార్టీ, ప్రభుత్వంలో ఉన్నవారి వల్లే ఎక్కువ తలనొప్పులు మొదల్యయాయి. ఇప్పటికే పలువురు పార్టీ నేతలు రోజుకొక అనుచిత వ్యాఖ చేస్తూ మోడీ పరువు బజారుకి ఈడుస్తుండగా ఇప్పుడు ఏకంగా కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి రాజన్ గోహేన్ ఒక అత్యాచార కేసులో ఇరుక్కున్నారు. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తమను లోబరుచుకున్నట్లు ఇద్దరు మహిళలు అస్సాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగాల ఆశ చూపి గత ఏడెనిమిది నెలలుగా కేంద్ర మంత్రి లైంగికంగా వేధిస్తున్నారంటూ బాధితులు ఆరోపించారు.
ఆయన పనయిపోయాక ఉద్యోగాల కోసం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని, ఇంటికి వెళ్తే లోపలి అనుమతించడం లేదని బాధితులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. మంత్రి తమతో మాట్లాడిన టెలిఫోనిక్ సంభాషణల క్లిప్స్ తమవద్ద ఉన్నాయని బాధితులు చెప్పారు. దీంతో ఇక కేంద్రమంత్రి రాజన్ గోహేన్పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నాగావ్ జిల్లా డియోరిజాన్కు చెందిన ఇద్దరు అక్కాచెళ్లెళ్లు కేంద్ర రైల్వే సహాయమంత్రిపై ఫిర్యాదు చేశారని.. ఆగస్టు 2న తాము ఎఫ్ఐఆర్ నమోదు చేశామని జిల్లా ఎస్పీ పోలీసు సూపరింటెండెంట్ శంకర్ బి. రైమిడి ఓ వార్తా పత్రికకు తెలిపారు. గతంలో కేంద్ర మంత్రి రాజన్ గోహేన్ ఓ కార్యక్రమంలో వృద్ధుడితో కూడా దురుసుగా వ్యవహరించారు. తమ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను ఏకరువు పెట్టిన రిటైర్డ్ టీచర్ పట్ల కేంద్ర మంత్రి వ్యవహరించిన తీరు అప్పట్లో తీవ్ర వివాదాస్పదం అవగా ఇప్పుడు ఏకంగా అత్యాచార ఆరోపణలు రావడంతో మోడీ సర్కార్ కి మరో మచ్చ ఏర్పడింది.