Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత క్రికెట్ అభిమానులు ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేరు. రెగ్యులర్ గా క్రికెట్ మ్యాచ్ లు ఫాలో అయ్యే అభిమానులే కాదు… క్రికెట్ అంటే అంత ఆసక్తి లేని వారికి కూడా ఏప్రిల్ 2న భారత్ సాధించిన విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. భారత క్రికెట్ చరిత్రలో ఏప్రిల్ 2 సువర్ణాక్షరాలతో లిఖించిన రోజు. కోట్లాది భారతీయల ఆశలు ఫలించిన రోజు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో భారత్ తిరుగులేని ఆధిక్యత కనబర్చడంలో ఏప్రిల్ 2కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అన్ని ఫార్మట్లలో భారత క్రికెట్ ను శాసిస్తున్న విరాట్ కోహ్లీ ప్రాభవానికి బీజం పడింది ఈ రోజే. భారత్ అభిమానులే కాదు… క్రికెట్ అభిమానులెవరూ ధోనీ కొట్టిన ఆ చివరి సిక్స్ ను మర్చిపోలేరు. అవును… భారత్ ధోనీ నాయకత్వంలో వరల్డ్ కప్ సాధించి ఇవాళ్టికి సరిగ్గా ఏడేళ్లు.
2011 ఏప్రిల్ 2న ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ లో భారత్ అద్వితీయ విజయం సాధించి… 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వరల్డ్ కప్ అందుకుంది. విపరీతమైన అంచనాలు, ఒత్తిళ్ల మధ్య ధోనీ సేన సాధించిన ఈ విజయం భారత క్రికెట్ చరిత్రలోనూ అపూర్వం, అద్భుతం. ఫైనల్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 50 ఓవర్లలో 274 పరుగులు చేసింది. 275 పరుగుల విజయలక్ష్యంతో భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. జట్టు స్కోరు ఒక్క పరుగువద్ద డాషింగ్ ఓపెనర్ వీరెంద్ర సెహ్వాగ్ ఒక్క పరుగూ చేయకుండానే పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత కాసేపటికే 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఔటయ్యాడు. సచిన్ ఔట్ ప్రకటించిన వెంటనే మైదానమంతా నిశ్శబ్దం ఆవరించింది. అమీర్ ఖాన్ సహా పెద్ద ఎత్తున తరలివచ్చిన సెలబ్రిటీలు, సామాన్య ప్రేక్షకులు అంతా కూడా ముంబై వాంఖడే స్టేడియంలో మౌనంగా కూర్చుండిపోయారు. దేశవ్యాప్తంగా టీవీ సెట్ల ముందు కూర్చున్న ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పటి భారత కెప్టెన్…అప్పుడు జట్టులో అత్యంత జూనియర్ ఆటగాడు అయిన కోహ్లీతో కలిసి సీనియర్ ఆటగాడైన గౌతం గంభీర్ మ్యాచ్ చక్కదిద్దే ప్రయత్నంచేశాడు.
వాళ్లిద్దరూ వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి పంపుతూ భారత శిబిరంలో మళ్లీ ఆశలు రేపారు. కోహ్లీ ఔటవ్వగానే… కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ కు దిగాడు. ఇది శ్రీలంకకు షాక్. అసలైతే కోహ్లీ తర్వాత యువరాజ్ సింగ్ బ్యాటింగ్ చేయాల్సి ఉంది. కానీ… బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పుచేసి ధోనీ ముందొచ్చాడు. ఈ షాక్ నుంచి శ్రీలంక తేరుకునే ముందే ధోనీ దూకుడు పెంచాడు. ధోనీ, గంభీర్ కలిసి నాలుగో వికెట్ కు 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గంభీర్ 97 పరుగుల వద్ద ఔటయిన తర్వాత యువరాజ్ సింగ్ మైదానంలోకి వచ్చాడు. వస్తూనే దూకుడుగా ఆడాడు, ధోనీ, యువీ భాగస్వామ్యం చూసిన తర్వాత భారత్ విజయంపై నమ్మకం పెరిగిపోయింది. మైదానంలో అభిమానుల కేరింతలు, సందడి మధ్య చివరి ఓవర్ మొదలయింది. తొలి బంతిని ఎదుర్కొన్న యువీ ఒక పరుగు తీసి ధోనీకి స్ట్రయికింగ్ ఇచ్చాడు. రెండో బంతిని ధోనీ అద్భుతమైన సిక్స్ గా మలిచి భారత్ కు చిరస్మరణనీయ విజయాన్ని, వరల్డ్ కప్ ను అందించాడు. ధోనీ సిక్స్ కొట్టిన మరుక్షణం దేశం మొత్తం సంబరాలు మొదలయ్యాయి. స్టేడియంలో ప్రేక్షకులంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. సచిన్ సహా ఆటగాళ్లంతా మైదానంలోకి పరుగులు తీశారు. ఆనందభాష్పాలు కార్చారు. అదో అద్భుత క్షణం. మాటలకందని సంతోషం. ఉద్విగ్నభరిత సన్నివేశం.
ప్రజలంతా జాతీయ జెండా పట్టుకుని వీధుల్లోకొచ్చి, సంబరాలు జరుపుకున్నారు. సచిన్ ను, అప్పటి క్రికెట్ కోచ్ గ్యారీ కిర్ స్టన్ ను మిగిలిన ఆటగాళ్లు భుజాలపై ఎక్కించుకుని మైదానమంతా తిప్పారు. కోహ్లీ అయితే కాసేపు ఒక్కడే సచిన్ ను భుజంపై మోశాడు. ప్రేక్షకుల జయజయ ధ్వానాల మధ్య ధోనీ బృందం సగర్వంగా వరల్డ్ కప్ అందుకుంది. ఆ సన్నివేశాన్ని కనులారా తిలకిస్తూ… ప్రేక్షకులంతా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇది జరిగి అప్పుడే ఏడేళ్లు గడిచిపోయాయి. వరల్డ్ కప్ అందుకున్న క్రికెటర్లలో ఎక్కువమంది ఇప్పుడు జట్టులో లేరు. సచిన్, సెహ్వాగ్, గౌతం గంభీర్ వంటి సీనియర్లందరూ ఆటకు గుడ్ బై చెప్పారు. మరికొందరు ఫామ్ లేక జట్టులో చోటు కోల్పోయారు. అప్పుడు కెప్టెన్ గా ఉన్న ధోనీ ఏడేళ్ల తర్వాత జట్టులో ఓ సాధారణ క్రికెటర్ గా ఉన్నాడు. వరల్డ్ కప్ జట్టులో జూనియర్ ఆటగాడయిన కోహ్లీ ఇప్పుడు భారత జట్టుకు విజయవంతమైన కెప్టెన్ గా కొనసాగుతున్నాడు… కొత్తవారు అనేకమంది జట్టులో చేరారు. వరల్డ్ కప్ సాధించిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లో భారత్ శరవేగంగా ఎదిగింది. అత్యంత బలోపేతమైన జట్టుగా గుర్తింపు పొందింది. ఒకప్పుడు వెస్టెండీస్… తర్వాతి రోజుల్లో ఆస్ట్రేలియా ఏ స్థానంలో ఉన్నాయో… ఇప్పుడు భారత్ ఆ స్థితిలో ఉంది. ఏడేళ్లలో జరిగిన మార్పులివి.