ఆడవారి మీద జరిగే అత్యాచారాలను అరికట్టడానికి ప్రభుత్వం ఎన్ని రకాల చట్టాలు తీసుకువస్తున్నా వారి మీద జరిగే అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. అయితే కొత్తగా ఇప్పుడు మగవారి మీద మగవారే లైంగిక వేధింపులకు పాల్పడడం కలకలం రేపుతోంది. తాజాగా ఒక తొమ్మిదవ తరగతి చదివే బాలుడి మీద తన క్లాస్ మేట్ సహా మరో ఇద్దరు కలిసి గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. అది కూడా వారు చదువుతున్న ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలోనే చోటు చేసుకోవడం మగవారి నుండి మగవారి భద్రతను ప్రశ్నిస్తోంది.
ఈ ఏడాది జూన్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం ఈ ఏడాది మే-జూన్‌లో పాఠశాల నిర్వహించిన సమ్మర్ క్యాంప్ సందర్భంగా పాఠశాల భవనంలోని మూడో అంతస్తులో కంప్యూటర్ ల్యాబ్ పక్కనే ఉన్న ఖాళీ గదిలోకి తనను తీసుకువెళ్లిన ఇద్దరు బాలురు తనను లైంగికంగా వేధించారని ఒక విద్యార్థి పోలీసులకి ఫిర్యాదు చేశాడు. ఎవరికైనా ఈ విషయం చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బెదిరించి వాళ్ళు మరిన్ని సార్లు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి నుండి వేధింపులు ఎక్కువవడంతో జరిగిన విషయం తల్లితండ్రులకు చెప్పగా వారి చొరవతో బాలుడు నిందితులపై ఫిర్యాదు చేశాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.