Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘అందాలరాక్షసి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి మెల్ల మెల్లగా స్టార్‌డంను సంపాదించుకుంటూ ఉంది. ఈ అమ్మడు తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్, వివి వినాయక్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఇంటిలిజెంట్’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా లావణ్య త్రిపాఠి హైదరాబాద్‌లో ఒక ప్రెస్‌మీట్‌లో పాల్గొంది. ఆ సమయంలోనే పసుపు రంగు డ్రస్‌లో మెరిసి పోయింది. ఆ డ్రస్ వేసుకుని, సినిమా ప్రమోషన్‌కు వెళ్తున్నట్లుగా సోషల్ మీడియా ట్విట్టర్‌లో లావణ్య పోస్ట్ చేసింది. ఆమె అందంకు మైమరచి పోయిన ఒక అభిమాని ఆమె ఫొటోకు చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది.
లావణ్య ఫొటోకు వరుణ్ అనే అభిమాని స్పందిస్తూ… అందంగా ఉండటమే నేరం అయితే లావణ్య త్రిపాఠిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఆమె తన అందంతో నా హృదయాన్ని బద్దలు చేస్తోంది, ఆమె నన్ను అందంతో చంపేస్తోంది, దయచేసి ఆమెను వెంటనే అరెస్ట్ చేయండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందుకు స్పందించిన లావణ్య త్రిపాఠి కాస్త గడుసుగా మా నాన్న లాయర్ అంటూ చెప్పుకొచ్చింది. ఒక వేళ అరెస్ట్ చేయించినా కూడా నాన్న లాయర్ అవ్వడంతో వెంటనే బయటకు వచ్చేస్తాను అనేది ఆమె మాట. వీరిద్దరి మద్య సంభాషణను ప్రస్తుతం నెటిజన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉండే ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి అభిమానులతో తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. తెలుగుతో పాటు తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తున్న లావణ్య త్రిపాఠికి ‘ఇంటిలిజెంట్’ చిత్రం తప్పకుండా మంచి పేరును తెచ్చి పెడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.