Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మహాభారతం గురించి ఈ మధ్య దేశంలో ఎక్కువగా చర్చ నడుస్తోంది. దూరదర్శన్ లో మహాభారతం సీరియల్ గా ప్రసారమై విజయవంతమైన తరువాత…. మహాభారతాన్ని సినిమాగా తీయాలనే ఆసక్తి అప్పట్లో పలువురికి కలిగింది. కానీ ఎందుకో ఏ భాషలోనూ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. తర్వాత ప్రైవేట్ శాటిలైట్ చానల్స్ వచ్చిన తరువాత స్టార్ టీవీలో మహాభారతం సీరియల్ గా ప్రసారమై బాగా రేటింగ్స్ దక్కించుకుంది. అదే అనేక దక్షిణాది భాషల్లోనూ డబ్బింగ్ సీరియల్ గా ప్రసారమైంది. ఆక్రమంలోనే మళ్లీ మహాభారతాన్ని తెరకెక్కించాలని పలు భాషలకు చెందిన దర్శక నిర్మాతలు భావించారు. మహాభారతంలో ఏదో ఓ క్యారెక్టర్ ను ప్రధానంగా తీసుకుని భారతీయ భాషల్లో పలు సినిమాలు వచ్చాయి కానీ..మొత్తంగా మహాభారతం ఇప్పటిదాకా ఎవరూ చిత్రీకరించలేదు. నిజానికి మహాభారతాన్ని మూడు గంటల సినిమాలో నిక్షిప్తం చేయడం చాలా కష్టం. అందుకే రాజమౌళి బాహుబలి 1, బాహుబలి 2 తీసిన తరువాత…
మహాభారతాన్ని కూడా రెండు, మూడు భాగాలుగా తీయొచ్చని కొందరు దర్శకులు అంచనాకు వచ్చారు. రాజమౌళినే మహాభారతాన్ని దృశ్యకావ్యంగా మలుస్తారని వార్తలూ వచ్చాయి. అనేక సందర్భాల్లో రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతం అని కూడా చెప్పాడు. కానీ ఎందుకనో గానీ ఇటీవలే ఆయన మహాభారతాన్ని తెరకెక్కించే ఆలోచన లేదని స్ఫష్టంచేశాడు. భీమున్ని ప్రధాన పాత్రగా చూపిస్తూ మలయాళ రచయిత వాసుదేవన్ నాయర్ రచించిన ఓ నవల ఆధారంగా మహాభారతాన్ని తెరకెక్కించేందుకు యాడ్ ఫిలం డైరెక్టర్ వి.ఆర్. మీనన్ సిద్ధమవడమే రాజమౌళి మనసు మార్చుకోటానికి కారణంగా తెలుస్తోంది. మలయాళ చిత్రాన్ని వెయ్యికోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
దుబాయ్ లో ఉంటున్న భారత బిలియనీర్ బి. ఆర్. సెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ భీముని పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని, 2020లో సినిమా రిలీజవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. మరోవైపు రాజమౌళి మహాభారతాన్ని తీయకపోవడంపై అందరికన్నా ఎక్కువగా బాధపడుతోంది బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్. ఎందుకంటే రాజమౌళి మహాభారతంలో అమీర్ కర్ణుడు పాత్రగానీ, అర్జునుడు పాత్రగానీ అర్జునిడిగా గానీ పోషించాలని ఉవ్విళ్లూరాడు.
ఇప్పుడు రాజమౌళి ఆ ప్రాజెక్టును అటకెక్కించడంతో అమీర్ తానే సొంతంగా సినిమా నిర్మించేటట్టు కనిపిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. మహాభారతంలో నటించాలన్నది తన కోరికని, తనకున్న జ్ఞానంతో సినిమా తీస్తే…15 నుంచి 20 ఏళ్లు పట్టే అవకాశముంటుందని అమీర్ ఖాన్ అన్నాడు. కర్ణుడి పాత్ర తనకు చాలా ఇష్టమని, అయితే ఆ క్యారెక్టర్ ను తన శరీరాకృతి సరిపోదు కాబట్టి…కృష్ణుడి పాత్ర పోషిస్తానని అమీర్ చెప్పాడు. మొత్తానికి మహాభారతాన్ని డ్రీమ్ ప్రాజెక్టుగా భావిస్తున్న అమీర్ ఖాన్ 15 ఏళ్ల తర్వాతయినా..తన కల నెరవేర్చుకునే ఆలోచనలో ఉన్నాడు.