సినిమా రిలీజ్ కోసం అప్పడిగి…మర్డర్ కేసులో చిక్కుకున్న టాలీవుడ్ నటుడు !

Actor Surya Involved In NRI Murder Case

ఎన్నారై చిగురుపాటి జయరాం హత్యకేసులో రోజుకొకటిగా బయటకు వస్తున్న ట్విస్టులతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మూడు రోజులుగా రాకేశ్‌ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు అనేక విషయాలను రాబట్టారు. అయితే కొన్నింటికి మాత్రం నిందితుడు చెప్పిన సమాధానాలకు పోలీసులకు దొరికిన ఆధారాలకు పొంతన కుదరడం లేదు. రాకేశ్‌రెడ్డి తాను చెబుతున్న వివరాలకు ఆధారాలు చూపించలేకపోవడంతో పోలీసులకు ఈ కేసుని సాల్వ్ చేయడం తలనొప్పిగా మారింది.

అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటుడు సూర్య ప్రసాద్ పాత్ర మీద పోలీసులు ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. రాకేశ్‌రెడ్డిని రూ.25లక్షల అప్పు అడిగినందువల్లే సూర్య ప్రసాద్ఈ హత్యలో భాగస్వామ్యమైనట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సూర్యప్రకాష్‌ ‘కలియుగ’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దాని నిర్మాణం కోసం రూ.25 లక్షలు అప్పు ఇవ్వాలంటూ కొద్ది నెలలుగా రాకేష్‌రెడ్డిని అడుగుతున్నాడు. ఆడియో విడుదలకు సమయం దగ్గరపడుతోందంటూ ఒత్తిడి తెచ్చిన మీదట జనవరి నెలాఖరులో ఇస్తానని రాకేశ్ హామీ ఇచ్చాడు. జనవరి 30న రాకేష్‌రెడ్డి, సూర్యప్రకాష్‌కు ఫోన్‌ చేశాడు. తన స్నేహితుడు జయరాంను కారులో ఇంటికి తీసుకొస్తే ఆ సొమ్ము ఇస్తానని నమ్మించాడు. అంగీకరించిన అతను తన కారులో, స్నేహితుడు కిషోర్‌తో కలిసి రాకేష్‌రెడ్డి ఇంటికి వెళ్లాడు.

తర్వాత ముగ్గురూ అదే కారులో జూబ్లీహిల్స్‌ క్లబ్‌ సమీపంలోకి చేరుకున్నారు. తర్వాత రాకేష్‌రెడ్డి ‘నా స్నేహితుడు కిషోర్‌ వస్తాడు. అతని కారులో రావాలంటూ’ వీణ పేరుతో జయరాంకు మెసెజ్ పంపాడు. జయరాం జూబ్లీహిల్స్‌ క్లబ్‌ వద్దకు వచ్చాక కిషోర్‌ అతని కారులో ఎక్కించుకుని రాకేష్‌రెడ్డి ఇంటికి తీసుకొచ్చాడు. అంతకుమునుపే సూర్య ప్రసాద్, రాకేష్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. తర్వాత అందర్నీ బయటికి పంపించిన రాకేశ్‌రెడ్డి జయరాంతో గొడవపడి బంధించాడని పోలీసులు తమ విచారణలో తెలుసుకున్నారు. అయితే ఈ విషయాలు అన్నీ తేల్చకుండా ఏపీ పోలీసులు ఎలా వదిలేశారు అనే చర్చ మొదలయ్యింది. కొద్ది రోజులు విచారణ చేసిన ఏపీ పోలీసులు ఈ కేసులో రాకేశ్ రెడ్డి ఒక్కడే నిందితుడు అని పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.