Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
శ్రీదేవి హఠాన్మరణం యావత్ భారతావనినే ఇంతగా కలిచివేస్తోంటే… ఇక ఆమె జీవిత భాగస్వామి బోనీకపూర్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేని విషయం. శ్రీదేవిని ప్రేమించి పెళ్లిచేసుకుని… చివరిక్షణందాకా అదే ప్రేమను అందించిన బోనీకపూర్ ఆమె మరణం తర్వాత ఎలా ఉన్నారన్నది అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న అంశం. అందరూ భయపడుతున్నట్టుగానే శ్రీదేవి మరణాన్ని బోనీ తట్టుకోలేకపోతున్నారు. తాను సడన్ సర్ ప్రైజ్ చేద్దామని దుబాయ్ వెళ్లగా… ఆమె… తనకు షాకిస్తూ తిరిగిరాని లోకాలకు పయనమవడం బోనీకి అర్ధం కావడం లేదు. శ్రీదేవి మృతితో ఆయన చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నారని పాకిస్థాన్ నటుడు అద్నాన్ సిద్ధిఖీ చెప్పాడు. శ్రీదేవి నటించిన చివరి సినిమా మామ్ లో అద్నాన్ ప్రధాన పాత్ర పోషించాడు. దుబాయ్ లో శ్రీదేవి హాజరైన బోనీ మేనల్లుడి పెళ్లికి అద్నాన్ కూడా వెళ్లాడు. ప్రస్తుతం తాను దుబాయ్ లోనే ఉన్నానని, శ్రీదేవి మరణించిన తర్వాత దుబాయ్ లో తాను బోనీని కలిశానని, అద్నాన్ తెలిపాడు. బోనీ చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నారని, దేశం మొత్తం చాలా బాధలో ఉందని, అమెరికా, పాకిస్థాన్, యూకే తదితర దేశాల నుంచి నివాళులర్పిస్తూ సందేశాలు పంపుతున్నారని బోనీ తనతో చెప్పినట్టు అద్నాన్ వెల్లడించాడు.
శ్రీదేవిని తాను కలిసిన తొలిరోజును అద్నాన్ గుర్తుచేసుకున్నాడు. శ్రీదేవి, బోనీ అతిథులను చాలా బాగా చూసుకుంటారని, తాను తొలిసారి ఆమెను కలిసినప్పుడు కుర్చీలో కూర్చుని ఉన్న ఆమె పైకి లేచి పలకరించారని తెలిపాడు. నాలుగు రోజుల క్రితం ఆమెను దుబాయ్ లో మోహిత్ పెళ్లిలో చూశానని, చాలా అందంగా ఉన్నారని, నాలుగు రోజుల తర్వాత ఆమె ఇకలేరు అంటే నమ్మలేకపోతున్నానని అద్నాన్ ఆవేదన వ్యక్తంచేశాడు. ఆమె అంత్యక్రియలకు హాజరుకావాలని ఉన్నా… ఇరుదేశాల మధ్యా ఉన్న పరిస్థితులు సహకరించకపోవడం దురదృష్టకరమని వాపోయాడు. శ్రీదేవి మృతి చాలామందిని దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఆమె తన నటనతో జీవితాన్ని వేడుకగా మలుచుకున్నారని, వెండితెరపై మహారాణిగా వెలిగిన కథానాయిక ఆమె అని అద్నాన్ కొనియాడాడు. శ్రీదేవిని భారత్ లో ఎంతగా ఇష్టపడతారో… పాకిస్థాన్ లో కూడా అంతే ఇష్టపడతారని, తనకు మామ్ లో సహనటి సజల్ అలికి శ్రీదేవితో, ఆమె కుటుంబంతో మంచి బంధం ఉందని తెలిపాడు. ఇది మిశ్రమ భావోద్వేగాలతో కూడిన సమయమని, శ్రీదేవి చివరి సినిమాలో ఆమెతో కలిసి నటించడం గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నానని, ఆమె ఇకలేరు అన్న మాట తనను చాలా బాధిస్తోందని తెలిపాడు.
బోనీ మేనల్లుడు పెళ్లిరోజు జరిగిన సంఘటనను కూడా ఆయన వివరించారు. పెళ్లిరోజు తాను ఎక్కిన విమానం రాత్రి 12 గంటలకు అక్కడుకు చేరిందని, ఆలస్యం అవుతుందనుకున్నానని, ఆ రోజు బోనీ తనను కచ్చితంగా పెళ్లికి రావాల్సిందే అన్నారని గుర్తుచేసుకున్నాడు. మామ్ సినిమా తర్వాత శ్రీదేవి మిమ్మల్ని చూడలేదని, ఆమె మీ కోసంఎదురుచూస్తోందని బోనీ చెప్పారని, అక్కడకు వెళ్లిన తర్వాత శ్రీదేవి తనను వారి కుటుంబ సభ్యులకు పరిచయం చేశారని, చాలా ఆలస్యంగా వచ్చారు అని తనతో అన్నారని అద్నాన్ చెప్పాడు. శ్రీదేవి అన్న మాటలు తన చెవులకు ఇంకా వినిపిస్తున్నాయని, అదే ఆమె తనకిచ్చిన చివరి వీడ్కోలు అయిందని అద్నాన్ ఆవేదన వ్యక్తంచేశాడు.