అజ్ఞాతవాసి నైజా డిస్ట్రిబ్యూటర్‌కు నష్టమెంతో తెలుసా?

Agnathavasi Telangana Destributers Loss Details

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సంక్రాంతి కానుకగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. ఫ్యాన్స్‌ బాహాటంగా సినిమా బాగాలేదని చెప్పడం లేదు, కాని వారు కూడా చాలా నిరుత్సాహంతో ఉన్నారు. భారీ బ్లాక్‌ బస్టర్‌ అనుకున్న సినిమా కాస్త ఇలా అవ్వడంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. సహజంగా అయితే స్టార్‌ హీరోల సినిమాలు సక్సెస్‌ అయినా ఫ్లాప్‌ అయినా మొదటి రెండు మూడు రోజులు మంచి కలెక్షన్స్‌ను సాధిస్తాయి. కాని అజ్ఞాతవాసికి ఆ పరిస్థితి కనిపించడం లేదు. కారణం రేపు జైసింహ విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా కారణంగా ‘అజ్ఞాతవాసి’ కలెక్షన్స్‌కు బ్రేక్‌ పడే అవకాశం ఉంది. 

అన్ని ఏరియాల్లో కూడా అజ్ఞాతవాసి చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేక పోతుంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో అజ్ఞాతవాసి చిత్రంపై చాలా అంచనాలున్నాయి. ఆ అంచనాలతో ఏకంగా 30 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది. కాని ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే నైజాంలో 10 కోట్లు వస్తే గొప్పే అన్నట్లుగా ఉంది. అటు ఇటుగా నైజాం డిస్ట్రిబ్యూటర్‌కు 20 కోట్ల వరకు నష్టం తప్పదు అంటూ ఫిల్మ్‌ సర్కిల్స్‌లో మరియు ట్రేడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతుంది. 

భారీ అంచనాలున్న ‘అజ్ఞాతవాసి’ చిత్రం మొదటి వారంలోనే నైజాంలో 30 కోట్లు వసూళ్లు చేస్తుందనే నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్‌ ఇంత మొత్తంను పెట్టి కొనుగోలు చేశాడు. కాని పరిస్థితి తారు మారు అవ్వడంతో ఏం చేయాలో పాలు పోవడం లేదు. పైగా చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమాకు ప్రమోషన్‌ ఏమీ చేయక పోవడంతో కలెక్షన్స్‌ ఇంకా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. మీడియా ముందుకు వచ్చి పవన్‌ లేదా త్రివిక్రమ్‌ సినిమా గురించి మాట్లాడితే బాగుంటుందని డిస్ట్రిబ్యూటర్లు కోరుకుంటున్నారు. కాని సినిమా ఫ్లాప్‌ నేపథ్యంలో త్రివిక్రమ్‌, పవన్‌లు మీడియా ముందుకు వచ్చే అవకాశాలు లేవు. నైజాం ఏరియాతో పాటు అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు కూడా కోట్లల్లో నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.