Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాహుబలి తర్వాత ప్రభాస్ జాతీయస్థాయి హీరో అయ్యారు. బాలీవుడ్ హీరోలకు దీటుగా ప్రభాస్ దేశవ్యాప్తంగా ఫాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. అందుకే గత వారం ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో దేశం నలుమూలల నుంచీ ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో ప్రభాస్ కు ఓ వీరాభిమాని ఉన్న విషయం వెలుగుచూసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ మహిళా అభిమాని గురించి వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్, అలహాబాద్ నగర పోలీస్ విభాగం క్రైమ్ బ్రాంచ్ లో పనిచేస్తున్న ఓ మహిళా అధికారిణి ప్రభాస్ కు వీరాభిమాని. ప్రభాస్ పుట్టినరోజు వేడుకలను ఆమె ఘనంగా జరిపారు. ప్రభాస్ తన జీవితమని, ఎన్నో బాధలు అనుభవించిన తాను కష్టాల్లో ఉన్న వేళ, ప్రభాస్ సినిమాలు చూసి స్వాంతన పొందానని ఆమె తెలిపారు. స్క్రీన్ పై ఆయన్ను చూసి తన బాధలన్నీ మర్చిపోయానని, ఆయన్ను చూస్తే తనకెంతో ఆనందం కలుగుతుందని చెప్పారు. తనకు జీవితంలో ప్రేరణ ఇస్తోంది ప్రభాసేనన్నారు. తన అభిమానం సంగతి ప్రభాస్ కు తెలియాలని కోరుకుంటున్నానన్నారు. మొత్తానికి బాహుబలితో ప్రభాస్ ఎందరికో కలల రాకుమారుడు అయ్యారు.