Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి పదవికి ఎసరు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న దినకరన్ వర్గానికి అన్నాడీఎంకె గట్టి షాకిచ్చింది. పార్టీ నుంచి చిన్నమ్మ శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్‌ను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. శశికళ చేపట్టిన నియామకాలేవీ చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. పళనిస్వామి, పన్నీర్ వర్గం కలయిక తర్వాత పార్టీని మళ్లీ చీలిక దిశగా నడిపిస్తూ రిసార్టు రాజకీయాలు చేస్తున్న దినకరన్ కు అన్నాడీఎంకె నిర్ణయంతో గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు.
శశికళను, దినకరన్‌ను పార్టీ నుంచి తొలగించామని, ఇకపై దినకరన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా చెల్లదని అన్నాడీఎంకె ఎంపీ ముతుకరప్పన్ చెప్పారు. అన్నాడీఎంకె ఉప ప్రధానకార్యదర్శిగా దినకరన్ నియామకం పార్టీ నియమాల ప్రకారం జరగలేదని, ఈ నియామకాన్ని ఎన్నికల సంఘం కూడా ధృవీకరించలేదని ఎంపీ చెప్పారు. అన్నాడీఎంకెకు చెందిన జయ టీవీ, నమదు ఎంజీఆర్ పత్రికను పార్టీ నియంత్రణ లోకి తేవాలని కూడా పార్టీ నిర్ణయించింది.
ప్రస్తుతం జయ పబ్లికేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న నమదు ఎంజీఆర్ పత్రికకు శశికళ యజమానిగా ఉన్నారు. జయ టీవీని మ్యాజిక్.కామ్ నిర్వహిస్తోంది. అన్నాడీఎంకె నిర్ణయాల తరువాత ఇక దినకరన్ రాజకీయ భవిష్యత్ ఏమిటో తేలాల్సిఉంది. గత ఏడాది డిసెంబరులో జయలలిత మరణించిన దగ్గరనుంచి తమిళనాడులో రాజకీయ అనిశ్చితి రాజ్యమేలుతోంది. ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం బాధ్యతలు స్వీకరించటం, శశికళ ఒత్తిడితో రాజీనామా చేసి, ఆ తర్వాత ఆమెపై తిరుగుబాటు చేయటం, అక్రమాస్తుల కేసులో శశికళ జైలుపాలవ్వటం, రిసార్టు రాజకీయాల తర్వాత పళనిస్వామి ముఖ్యమంత్రి కావటం, తరువాత ఈపీఎస్, ఓఎపీఎస్ వర్గాల మద్య సయోధ్య కుదరటం, వెనువెంటనే దినకరన్ తిరుగుబాటు చేయటం వంటి పరిణామాలతో తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చి తమిళనాడులో రాజకీయ స్థిరత్వం ఎప్పుడు ఏర్పడుతుందో ఎవరికీ అర్ధంకావటం లేదు.
మరిన్ని వార్తలు: