Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్నాళ్లు కలిసుంటాయో… తెలియదు కానీ…బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని కొన్ని పార్టీలు కలిసి నడవాలని నిర్ణయించాయి. బీహార్ రాజధాని పాట్నాలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ నిర్వహించిన ర్యాలీ ఇందుకు వేదికయింది. బీజేపీ వ్యతిరేకతే ప్రాతిపదికగా అనేక పార్టీల నేతలు ర్యాలీ వేదికపై చేయి చేయి కలిపారు.
బీజేపీని 2019 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రాకుండా చేయటమే ఇప్పుడు ఈ పార్టీల ముందున్న ఏకైక లక్ష్యం. మహాకూటమి విచ్ఛిన్నం తరువాత బీజేపీ పై తీవ్ర ఆగ్రహ జ్వాలలతో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ ప్రతిపక్షాలన్నింటినీ కూడగట్టుకుని మోడీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పోరాడాలని భావిస్తున్నారు. ఈ పోరాటానికి మద్దతిచ్చేందుకు కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ముందుకొచ్చాయి. ర్యాలీకి కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, పశ్చిమ బం గ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరయ్యారు. నార్వే పర్యటనలో ఉండటంతో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ర్యాలీకి హాజరు కాలేదు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మహాకూటిమితో పొత్తును తెగతెంపులు చేసుకుని బీజేపీతో చేలిమి చేయటాన్ని వ్యతిరేకిస్తున్న జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్ కూడా ఈ ర్యాలీకి హాజరయ్యారు.
దీంతో జేడీయూలో ఇక చీలిక తప్పని పరిస్థితి ఏర్పడింది. ర్యాలీలో ప్రసంగించిన నేతలంతా మోడీ, అమిత్ షా పై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం దేశం అత్యవరసర పరిస్థితి ఎదుర్కొంటోందని , మోడీని వ్యతిరేకిస్తున్నవారందరూ కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారని లాలూ విమర్శించారు. ర్యాలీ సందర్భంగా పాట్నా ఆకుపచ్చ రంగు పులుముకుంది. ర్యాలీ జరిగిన గాంధీ మైదాన్ లో ఎక్కడ చూసినా ఆర్జేడీ జెండాలు, లాలూ ప్రసాద్ యాదవ్ కటౌట్లే కనిపించాయి. మరోవైపు ఈ ర్యాలీపై బీహార్ అధికారపక్షం మండిపడింది. ప్రజలు వరదలతో అల్లాడుతోంటే….వారిని పరామర్శించాల్సింది బదులు నేతలు ర్యాలీలు చేయటంలో బిజీగా ఉన్నారని, ఆగస్టు 27 దేశ రాజకీయ చరిత్రలోనే ఓ చీకటిరోజు అనే జేడీయూ ప్రతినిధి సంజయ్ సింగ్ ఎద్దేవా చేశారు.