Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అక్కినేని ప్రిన్స్ అఖిల్ మొదటి రెండు సినిమాలతో తీవ్రంగా నిరాశ పర్చాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. వెంకీతో సినిమా పూర్తి అయ్యి, విడుదలైన తర్వాత వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అఖిల్ ఒక సినిమా చేసే అవకాశం ఉందని అంతా అనుకుంటున్నారు. వర్మ పలు సార్లు తాను త్వరలో అఖిల్‌తో సినిమా చేయబోతున్నట్లుగా చెబుతూ వచ్చాడు. వర్మ స్క్రిప్ట్ కూడా అఖిల్ కోసం సిద్దం చేశాను అంటూ పలు సందర్బాల్లో ప్రకటించాడు. అయితే తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఆఫీసర్’ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. దాంతో వర్మతో అఖిల్ మూవీ వద్దంటూ అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అఖిల్‌తో వర్మ సినిమా చేస్తే నాశనం తప్ప మరేం లేదు అంటూ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందుకే అక్కినేని ఫ్యాన్స్ అఖిల్‌కు వర్మతో సినిమా చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆమద్య వర్మ కటౌట్‌కు ఏకంగా పాలాభిషేకం చేసి అఖిల్‌తో సినిమా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఇదే విషయాన్ని తాజాగా అఖిల్‌తో సంప్రదించేందుకు మీడియా ప్రయత్నించింది. వర్మతో మీ సినిమా ఎప్పుడు అంటూ ప్రశ్నించిన సమయంలో.. ప్రస్తుతం తన దృష్టి అంతా కూడా వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమాపైనే ఉంది. మరే సినిమా గురించి ఆలోచించను. తన తదుపరి సినిమా ఏది అనే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అభిమానులకు నచ్చినట్లుగా మాత్రమే సినిమా చేస్తాను. అభిమానుల కోసం సినిమా చేస్తాను, వారు కోరుకున్నట్లుగానే నా కెరీర్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. దాంతో అఖిల్‌కు కూడా వర్మ దర్శకత్వంలో చేయడం ఇష్టం లేదని, ఫ్యాన్స్ కోరిక మేరకు అఖిల్ వర్మతో సినిమా క్యాన్సిల్ చేసుకున్నట్లే అంటూ సమాచారం అందుతుంది. మొత్తానికి వర్మకు అఖిల్ ఇండైరెక్ట్‌గా షాక్ ఇచ్చేశాడు. మరి ఇప్పుడు వర్మ ఏం చేస్తాడో చూడాలి.