Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేసీఆర్ తలపెట్టిన గుణాత్మక మార్పును సమాజ్ వాదీ పార్టీ సమర్థిస్తోందని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ చెప్పారు. ప్రత్యామ్నాయ కూటమిపై హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కేసీఆర్, అఖిలేశ్ చర్చించిన అనంతరం… ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. దేశంలో మార్పుకు బీజం పడిందని అఖిలేశ్ అభిప్రాయపడ్డారు. తాము ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తున్నామని, బీజేపీని నిలువరించే శక్తి వాటికే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇది కేవలం పార్టీలను ఏకం చేయడమే కాదని, ప్రగతిశీల భావనలు కలిగిన నాయకుల కలయిక అని అఖిలేశ్ విశ్లేషించారు. బీజేపీ అనేక హామీలు ఇచ్చిందని, ఏమీ నెరవేర్చలేకపోయిందని, ఎన్నికలకు ఇంకా ఏడాది కాలమే మిగిలిఉందని… మరి వారి హామీలు ఎలా నెరవేరుతాయని ఆయన ప్రశ్నించారు. నోట్లరద్దుతో పెద్ద మార్పు వస్తుందని బీజేపీ చెప్పిందని, బీజేపీ చెప్పిన మాటలు నిజం కాలేదని, ఇటీవల ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని అఖిలేశ్ విమర్శించారు.
దేశంలో ఆర్థిక వృద్ధి జరగాల్సిన స్థాయిలో లేదని, స్వతంత్ర భారతావనిలో ఇప్పటికీ సాగు, తాగునీటి సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయని, రైతులు సంతోషంగా లేకుంటే అభివృద్ధి సాధ్యం కాదని ఆయనన్నారు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, తన సుపరిపాలనతో కేసీఆర్ ప్రజల్లో భరోసా నింపారని అఖిలేశ్ ప్రశంసించారు. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు క్రియాశీలపాత్ర పోషించేందుకు ప్రయత్నిస్తున్నాయని కేసీఆర్ అన్నారు. 2019 ఎన్నికల కోసం పార్టీలను ఏకం చేయడం మాత్రమే కాకుండా రాజకీయాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
అఖిలేశ్ యాదవ్ తో నెలరోజులు నుంచి చాలాసార్లు మాట్లాడానని, దేశంలో పరివర్తన రావాలన్నదే తమ ప్రయత్నమని అన్నారు. అఖిలేశ్ తో అన్ని విషయాలపై సమగ్రంగా చర్చించామని, హైదరాబాద్ తో సమాజ్ వాదీపార్టీకి మంచి సంబంధాలున్నాయని, ఆ బంధం మరింత బలపడుతుందని కేసీఆర్ విశ్వాసం వ్యక్తంచేశారు. తాను చెప్పిన అన్ని అంశాలకు అఖిలేశ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారని కేసీఆర్ వెల్లడించారు. తాము ఏర్పాటు చేయబోయేది మూడో, నాలుగో, ఐదో ఫ్రంట్ కాదని కేసీఆర్ వ్యాఖ్యానించారు.