Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సాధారణంగా చిత్రసీమలో ప్రధానంగా వచ్చే ఆరోపణ..రెమ్యునరేషన్ విషయంలో హీరోలతో పోలిస్తే హీరోయిన్లను చిన్నచూపు చూస్తున్నారని. ఎంతో కాలం నుంచి అన్ని భాషల్లోనూ ఈ ఆరోపణ వినిపిస్తూనే ఉంది. కొన్నిరోజుల క్రితం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా దీనిపై అసంతృప్తి వ్యక్తంచేసింది. హీరోయిన్లకు రెమ్యునరేషన్ విషయంలో అన్యాయం జరుగుతోందని, దక్షిణాది సూపర్ స్టార్ గా పిలుచుకునే నయనతారకు సైతం హీరోలతో పోలిస్తే చాలా తక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారని విమర్శలు గుప్పించింది. దాదాపుగా అందరు హీరోయిన్లు ఇదే అభిప్రాయంతో ఉంటారు. కానీ టాలీవుడ్ లో హీరోలతో సమానంగా స్టార్ డమ్ తెచ్చుకుని, హీరోయిన్ ఓరియెంటడ్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్ గా మారిన అనుష్క మాత్రం ఇందుకు భిన్నమైన అభిప్రాయం వ్యక్తంచేసింది.
హీరోయిన్లతో పోలిస్తే…హీరోలకు ఎక్కవ పారితోషకం ఇవ్వడంలో ఎలాంటి తప్పూ లేదంది అనుష్క. వాస్తవానికి సినిమాల్ని హీరోలు తమ భుజాలపై మోస్తారు కాబట్టి వారు అధిక పారితోషకం తీసుకోవడానికి అర్హులన్నది తన అభిప్రాయమని తెలిపింది. అంతేకాకుండా సినిమా పరాజయం పాలైతే ఎక్కువ నష్టపోయేది కూడా వారేనని, కాబట్టి వారికి ఎక్కువ పారితోషకం ఇవ్వడం న్యాయమేనని అనుష్క వ్యాఖ్యానించింది. హీరోయిన్లు పారితోషకం కోసం పోరాటం చేయడం కన్నా.తమ కోసం ఉత్తమ కథలు రాసేలా, తమను శక్తిమంతమైన పాత్రల్లో చూపించేలా చేసేందుకు పోరాడితే బాగుంటుందని సలహా ఇచ్చింది. తన తాజా చిత్రం భాగమతి, అరుంధతి కంటే భిన్నమైనదని, థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిందని అనుష్క చెప్పింది.