ఏపీ శాసనమండలిలో వాడీవేడిగా చర్చ జరిగి అధికార-విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఉన్నత విద్యామండలిలో నిధుల మళ్లింపు మీద సభలో చర్చ జరగ్గా గత ప్రభుత్వ హయాంలో నిధులు దుర్వినియోగం చేశారని మంత్రి ఆరోపించారు. ఈ విమర్శలపై మాజీ మంత్రి నారా లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి అనిల్ కుమార్ వెంటనే ప్రతిపక్షంపై ఎదురు దాడికి దిగారు. పేద ప్రజల కోసమే నిధులు మళ్లించామని.. వారి నాయకుడిలా సొంత కంపెనీలకు కాదంటూ కౌంటరిచ్చారు. తమపై 11 ఛార్స్‌షీట్లు లేవని, 16 నెలలు జైలుకు వెళ్లలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సాక్ష్యాధారాలు లేకుండా విమర్శలు చేయడం మంచి పద్దతి కాదని ఆయన పేర్కోన్నారు.
వెంటనే మంత్రి అనిల్ కూడా ఘాటుగా స్పందించారు. మంగళగిరిని మందలగిరని జయంతిని వర్దంతి పలికిన వాళ్లు గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారంటూ లోకేష్‌పై మంత్రి అనిల్ సెటైర్లు పేల్చారు. లోకేష్‌కు తెలుగు భాషలో ట్రైనింగ్ ఇప్పించాల్సిన అవసరం ఉందని అనిల్ అన్నారు. అర్ధరాత్రి కాంగ్రెస్‌తో కుమ్మక్కై చిదంబరం కాళ్లు పట్టుకుని వైఎస్ జగన్‌పై తప్పుడు కేసులు పెట్టించారన్నారు. మంత్రి వ్యాఖ్యలపై లోకేష్ కూడా మండిపడ్డారు. తాను ఫారెన్‌లో చదివి వచ్చానని.. కొన్ని తెలుగు పదాలు పలకడంలో ఇబ్బందులు సహజమేనన్నారు లోకేష్. మంత్రి అనిల్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలన్నారు. వాళ్ల ముఖ్యమంత్రిలా తనపై కేసులు లేవని వారం, వారం కోర్టుకు వెళ్లడం లేదన్నారు.
లోకేష్ వ్యాఖ్యలతో సభలో గందరగోళం ఏర్పడింది. అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తర్వాత కూడా లోకేష్-వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. మళ్లీ లోకేష్ జగన్ కేసులు ప్రస్తావన తీసుకురావడంతో సభలో గందరగోళం ఏర్పడింది. లోకేష్ వ్యాఖ్యలపై మంత్రి బొత్స కూడా ఘాటుగా స్పందించారు. చంద్రబాబు కూడా 26 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారంటూ కౌంటరిచ్చారు. లోకేష్ క్షమాపణలు చెప్పాలని మంత్రి బొత్స డిమాండ్ చేశారు. తనకు మంత్రి అనిల్ క్షమాపణలు చెప్పాలని లోకేష్ కూడా ఎదురుదాడికి దిగారు. సభలో గందరగళం ఏర్పడడంతో మండలిని రేపటికి వాయిదా వేశారు.