పలు అభివృద్ధి కార్యక్రమాల ఓపెనింగ్ కోసం విజయవాడ వచ్చిన గవర్నర్‌కు ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. విజయవాడ గేట్‌వే గెస్ట్ హౌస్‌లో నరసింహన్ ను కలిసిన నేతలు దాదాపు 40 నిమిషాల పాటూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పాలనకు సంబంధించిన మూడు అంశాలపై గవర్నర్ కు వారు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీ సర్కార్ 54వేల పీడీ అకౌంట్లు తెరిచిందని.. వాటి ద్వారా భారీగా నిధుల్ని పక్కదారి పట్టించారని ఫిర్యాదు చేశారు. అలాగే విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేయాలని కూడా కోరారు.
ఇటు అమరావతి బాండ్ల పేరిట నిధుల్ని దోచేందుకు ప్రయత్నిస్తున్నారంటూ గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. గవర్నర్ తో భేటీ అనంతరం మీడియా తో మాట్లాడిన జీవీఎల్ పీడీ అకౌంట్ల వ్యవహారంపై అకౌంటెంట్ జనరల్ నుంచి వివరణ కోరినట్టు గవర్నర్ తమకు తెలిపారని చెప్పారు. మరిన్ని వివరాలను సేకరిస్తున్నామని, ఈ అంశాన్ని నిశితంగా గమనించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని తెలిపారు. పీడీ అకౌంట్లపై ఆర్థిక మంత్రి యనమల సహా అందరూ అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. ఎక్కువ అప్పులు తెచ్చుకుని, ఎక్కువ దోచుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.