ఏపీలో ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ టెక్కలి బహిరంగసభలో మంత్రి అచ్చెన్నాయుడు పై విమర్శలు గుప్పించారు. తాటి చెట్టంత పెరిగాడే తప్ప అభివృద్ధి చేయలేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే దీని మీద స్పండిన ఆయన జగన్ చేసిన ఆరోపణలను నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. జగన్ మోహన్ రెడ్డిని తలక్రిందులు నిలబెట్టినా నా పర్సనాలిటీ రాదు, అది దేవుడిచ్చిన వరం అన్నారు. టెక్కలిలో అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదన్న జగన్ విమర్శల్లో వాస్తవం లేదని, మీడియా సాక్షిగా ఇద్దరం నియోజక వర్గంలో తిరుగుదామని అభివృద్ధి జరగలేదని ప్రజలు చెబితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు.
ఇక తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయలేకపోతే టెక్కలి అంబేద్కర్ జంక్షన్ లో జగన్ తన ముక్కును నేలకు రాసుకుంటాడా? అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడైన కేసీఆర్ తో జగన్ చేతులు కలిపారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. గ్రామస్థాయికి ఎక్కువ, మండల స్థాయికి తక్కువ ఉన్న వైసీపీ నేతలు నన్ను విమర్శించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. దమ్ముంటే అభివృద్ధి కార్యక్రమాల పై స్థానిక నేతలు చర్చకు రావాలని సవాల్ చేశారు.