Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో ఎంత హాట్ టాపిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. రిలీజ్ కు ముందునుంచే అర్జున్ రెడ్డి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. లిప్ లాక్ లతో వెలిసిన పోస్టర్లు తీవ్ర కలకలం రేపాయి. అసభ్యంగా ఉందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్…బస్సుపై అంటించిన ఓ పోస్టర్ ను చించివేయడం సంచలనం సృష్టించింది. వీహెచ్ చర్యపై అప్పటికి ఎవ్వరికీ తెలియని అర్జున్ రెడ్డి టీం ఏమీ స్పందించలేదు కానీ..వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం గట్టిగా బదులిచ్చాడు. అర్జున్ రెడ్డి కోసం వీహెచ్ తో వాదోపవాదాలకు దిగాడు. ఇద్దరి మధ్యా కొన్నిరోజుల పాటు సవాళ్లూ, ప్రతిసవాళ్లూ నడిచాయి. సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు జరిగిన సంగతి ఇది. వివాదం కొనసాగుతుండగానే అర్జున్ రెడ్డి థియేటర్స్ లోకి వచ్చాడు.
లిప్ లాక్ లు, వర్మ, వీహెచ్ మధ్య తలెత్తిన వివాదం తప్ప అప్పటికి అర్జున్ రెడ్డి గురించి ఎవరికీ ఏమీ తెలియదు. ఓ శుక్రవారం అదృష్టం పరీక్షించుకోడానికి వచ్చే మామూలు సినిమాల్లానే అర్జున్ రెడ్డి కూడా వెండితెరపై ప్రత్యక్షమయ్యాడు. అందరిలానే వర్మకు కూడా సినిమా గురించి ఏమీ తెలియదు. అయినా సరే మొదటి రోజే వెళ్లి థియేటర్ లో కూర్చున్నాడు. బయటకు వచ్చి సినిమా అద్భుతంగా ఉందంటూ పొగిడాడు. రివ్యూలు సైతం రాకముందే తానే ఓ సమీక్షకుడిగా మారాడు. అర్జున్ రెడ్డిని తన మొదటి సినిమా శివతో పోల్చాడు. శివలానే అర్జున్ రెడ్డి సైతం కొత్త రికార్డులు సృష్టిస్తుందని జోస్యం చెప్పాడు. తన వ్యాఖ్యలతో సినిమాపై చిత్రయూనిట్ కు పూర్తి భరోసా కల్పించాడు. వర్మ అన్నదే జరిగింది. అర్జున్ రెడ్డి టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
మీడియా చానళ్లు, వార్తాపత్రికలు, సోషల్ మీడియా నిండా అర్జున్ రెడ్డి గురించే చర్చ. విజయ్ దేవరకొండ నటనకు, సందీప్ వంగా దర్శకత్వానికి ప్రశంసల వర్షం కురిసింది. నాలుగు కోట్ల బడ్జెట్ తో చిన్న సినిమాగా తెరకెక్కి…రూ. 50 కోట్లు వసూలుచేసింది. ఈ సంచలనం చూసి అన్ని భాషలవారికీ అర్జున్ రెడ్డిపై కన్నుపడింది. తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమలతో పాటు..బాలీవుడ్ సైతం రీమేక్ రైట్స్ కోసం టాలీవుడ్ కు క్యూ కట్టింది. అందరికీ కనెక్టయ్యే కథ కావడంతో ఆయా భాషల్లోనూ అర్జున్ రెడ్డి సంచలనాలు సృష్టిస్తుందని అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా కన్నడ, బాలీవుడ్ లో అర్జున్ రెడ్డిగా ఎవరునటిస్తారనేదానిపై క్లారిటీ లేదు గానీ..తమిళంలో పాత్రం హీరో సెట్టయ్యారు. తమిళ అగ్రహీరో విక్రమ్ తన కుమారుడు ధృవను అర్జున్ రెడ్డిగా వెండితెరకు పరిచయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే తెలుగులో ఇక్కడ నేటివిటీకి తగ్గట్టుగా అర్జున్ రెడ్డి పేరును పెట్టినట్టు..తమిళంలో వారి నేటివిటీకి చెందిన పేరు పెడతారని అంతా భావించారు.
కానీ ఆశ్చర్యంగా తమిళ అర్జున్ రెడ్డికి చిత్రయూనిట్ వర్మ అన్న పేరు ఖరారుచేసింది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ పై రాంగోపాల్ వర్మ స్పందించారు. ఇన్ స్టాగ్రామ్ లో ఈ పోస్టర్ ను షేర్ చేసిన వర్మ..తన పేరుతో ఉన్న ఈ టైటిల్ ను ఎక్కడో విన్నట్టుందే అని సరదాగా వ్యాఖ్యానించారు. అర్జున్ రెడ్డి తమిళ వెర్షన్ పేరు వర్మ అంట..ఈ పేరు ఎక్కడో విన్నట్టు, గుర్తున్నట్టు ఉంది అని కామెంట్ చేశారు. దీనిపై అభిమానులు అనేక కామెంట్ల చేశారు. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా ఈ టైటిల్ ను సూచించి ఉంటారని అనేకమంది అభిప్రాయపడ్డారు. ఇది నిజం అయినా కాకపోయినా…విడుదలకు ముందూ, తర్వాత…అర్జున్ రెడ్డికి అన్ని విధాలా అండగా నిలిచిన వర్మ..ఆ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. సినిమా తెరకెక్కడంలో ఆయన పాత్రేమీ లేనప్పటికీ…అది సంచలన విజయాన్ని నమోదు చేయడానికి… వర్మ తన మాటలతో పరోక్షంగా సాయమందించారు. అందుకే తమిళ రీమేక్ కు వర్మ అన్న టైటిల్ సరిగ్గా సూటవుతుంది.