యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య సర్జా వివాహం జూన్ 10న చాలా ఘనంగా జరిగింది. చెన్నైలోని అంజనాసుత శ్రీ యోగాంజనేయస్వామి మందిరంలో ఈ వివాహ వేడుకని నిర్వహించారు. ప్రముఖ తమిళ హాస్య నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో ఐశ్వర్య పెళ్లి కన్నుల పండుగగా జరిగింది.
జూన్ 7న హల్దీ కార్యక్రమంతో ప్రారంభమైన ఈ వివాహ వేడుకలో జూన్ 8న సంగీత్ కార్యక్రమం నిర్వహించారు. ఇక జూన్ 10న ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో వీళ్లిద్దరి వివాహం జరిగింది. అతిథులు నూతన వధూవరులని ఆశీర్వదించారు.
కాగా, వీరి రిసెప్షన్ వేడుకను జూన్ 14న చెన్నైలోని లీలా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఉమాపతి-ఐశ్వర్యల వివాహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అభిమానులు వారికి అభినందనలను తెలుపుతున్నారు.