Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రోహింగ్యా ముస్లింలపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్నా… మయన్మార్ మాత్రం ఇప్పటిదాకా స్పందించలేదు. మయన్మార్ లో మైనార్టీలుగా ఉన్న రోహింగ్యాలకు.. అక్కడి మెజార్టీలైన బౌద్ధులకు మధ్య తలెత్తిన ఘర్షణలు పలు దేశాలపై ప్రభావం చూపిస్తున్నాయి. రోహింగ్యాలు పొరుగు దేశాలైన భారత్, బంగ్లాదేశ్ కు వలసపోతున్నారు. రోహింగ్యా శరణార్థులపై భారత్ లో పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కావటం లేదుకానీ… బంగ్లాదేశ్ మాత్రం వారి రాకను అడ్డుకుంటోంది. ఆగస్టు 25 నుంచి దాదాపు 4.10 లక్షల మంది రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్ కు వలస వెళ్లారు. దీంతో ఆ దేశం అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. ఈ నేపథ్యంలో రోహింగ్యా వలసలపై మయన్మార్ నేత అంగ్ సాన్ సూకీ తన మౌనాన్ని వీడారు. న్యూయార్క్ లో జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆమె ఈ సమస్య గురించి మాట్లాడారు.
మత ఘర్షణల కారణంగా మయన్మార్ విడిపోవడాన్ని తాము ఎంతమాత్రం సహించబోమని ఆమె తేల్చిచెప్పారు. ఘర్షణల ప్రభావం రోహింగ్యా ముస్లింలు నివసించే గ్రామాలపై ఎంత మాత్రం పడలేదని సూకీ చెప్పారు. మయన్మార్ లో పరిస్థితులను కావాలంటే ప్రపంచ దేశాలకు చెందిన ప్రతినిధులు వచ్చి పరిశీలించవచ్చని ఆమె అన్నారు. రోహింగ్యాలకు మయన్మార్ పౌరసత్వం ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని సూకీ చెప్పారు. మయన్మార్ లోని రఖైల్ రాష్ట్రానికి చెందిన రోహింగ్యాలకు ఆ దేశ పౌరసత్వం లేదు. దీంతో వారిని శరణార్థులుగా పరిగణిస్తున్నారు. స్థానిక మెజారిటీ బౌద్ధులకు, రోహింగ్యాలకు మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండడంతో.. మయన్మార్ రోహింగ్యాలను దేశం నుంచి పంపిచేందుకు సైన్యంతో దాడులు చేయిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.