మాజీ క్రికెటర్, తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ త్వరలో కారెక్కబోతున్నారనే ప్రచారం మొదలయ్యింది. ఇందుకు ఆయన అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసుకున్నట్టు సమాచారం. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంపై ఆయనకు హామీ లభించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి తెలంగాణ శాసనసభ ఎన్నికల ముందే అజారుద్దీన్ కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరతారంటూ ప్రచారం జరిగింది. కానీ అప్పటికప్పుడు ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టడంతో అజారుద్దీన్ వెనక్కుతగ్గారు. తాజాగా, టీఆర్ఎస్ అధినాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అజార్ చేరిక పై తెలంగాణ సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్టు భోగట్టా.
దీనిపై అజారుద్దీన్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటీవల ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కుమార్తె వివాహానికి హాజరైన సమయంలోనే టీఆర్‌ఎస్ అధినేతను కలిసి పార్టీలో చేరికపై సంకేతాలు పంపినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఒవైసీ కుమార్తె వివాహానికి వచ్చిన కేసీఆర్‌ను కలిసిన అజార్, తన మనసులోని మాట వెల్లడించినట్టు భోగట్టా. మరోపక్క కాంగ్రెస్ ఆయనను మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి బరిలో దింపడానికి సిద్ధంగా ఉంది. కానీ, అజార్ మాత్రం తాను సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీచేస్తానని గతంలోనే ప్రకటించారు. ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్‌ల నుంచి లోక్‌సభకు పోటీచేసిన తాను 2019 ఎన్నికల్లో సొంత రాష్ట్రం నుంచి బరిలోకి నిలుస్తానని, తన నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లానని, తుది నిర్ణయం పార్టీ తీసుకోవాలని అప్పట్లో తెలిపారు. అజారుద్దీన్ తొలిసారిగా 2009 ఎన్నికల్లో యూపీలోని మొరాదాబాద్ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి విజయం సాధించారు. అయితే, 2014లో మాత్రం రాజస్థాన్‌లోని టోంక్-సవాయి మధోపూర్ బరిలో దిగి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు.