కియా ఫ్యాక్టరీపై మళ్లీ ఏపీ అసెంబ్లీలో రచ్చ జరుగుతోంది. సదావర్తి భూములపై చర్చ సమయంలో కియా ప్రస్తావన రాగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నిన్న ఆర్థిక మంత్రి బుగ్గన సభలో చదివి వినిపించిన లేఖ అంశాన్ని గుర్తు చేశారు. తప్పుడు ప్రచారాన్ని పదే, పదే నిజం చేయాలనుకోవడం సరికాదని అన్నారు. బుగ్గన కియా మోటార్స్ వచ్చింది వైఎస్ వల్లే వచ్చిందన్నారని మరో మంత్రి పట్టిసీమ వల్ల మచిలీపట్నంకు నీళ్లు రాలేదన్నారని ఇలా తప్పుడు ప్రచారం చేయడం మంచి పద్దతి కాదని అన్నారు. దీనిపై స్పందించిన మంత్రి బుగ్గన కియా మోటార్స్ విషయంలో ఆ కంపెనీ సీఈవో లేఖ రాసిన విషయం యదార్థమని గమనించాలన్నారు. మంత్రి వ్యాఖ్యలకు చంద్రబాబు వెంటనే కౌంటరిచ్చారు. మంత్రి రాజేంద్రరెడ్డి చాలా తెలివైన వారని హ్యాట్సాఫ్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అంటూ సెటైర్లు విసిరారు. ఎందుకంటే 2009లో రాజశేఖరెడ్డి గారు చనిపోయారని ఆయన ఆత్మ కియా సీఈవో దగ్గరికి వెళ్లిందా అంటూ ఎద్దేవా చేశారు. ‘2016లో మీరు చంద్రబాబు దగ్గరకెళ్లండి.. అనుమతిలు ఇస్తారు.. అన్ని పనులు చేస్తారు.. దీంతో కియా సీఈవో వచ్చి ఫ్యాక్టరీ పెట్టారు. అదే కదా మీరు చెప్పే కథ. ఏం ఏం చెప్పాలండీ రాజేంద్రరెడ్డి గారు.. మీరు ఎంత గొప్ప నాయకులంటే.. ఇలాంటి అసత్యాలను కూడా సత్యంగా చెప్పే మనస్తత్వం మీకుంది. దీనికి అభినందిస్తున్నా. మనస్ఫూర్తిగా మీకు కంగ్రాట్స్’అంటూ చంద్రబాబు నవ్వారు. చంద్రబాబు వ్యాఖ్యలపై బుగ్గన స్పందించారు. ప్రతిపక్ష నేత తనను తెలివైనవారన్నందుకు ధన్యవాదాలు చెప్తున్నానని తెలివి ఉన్నా లేకున్నా తాను చెప్పింది నిజమే కదా అన్నారు. జగన్‌కు రాసిన లేఖలో కియా సీఈవో ‘2007లో వైఎస్‌ను కలిశానని కలిసినప్పుడు స్వర్గీయ రాజశేఖరరెడ్డి గారు నన్ను ప్లాంట్ పెట్టమని రిక్వెస్ట్ చేశారు’ అని లేఖలో ప్రస్తావించిన మాట నిజమే కదా అన్నారు.