Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు వారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ‘ఎన్టీఆర్’ అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లుగా బాలకృష్ణ గొప్పగా ప్రకటించాడు. తేజ దర్శకత్వంలో సినిమా రూపొందబోతుందని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించాడు. సినిమా మరి కొన్ని రోజుల్లో ప్రారంభం అవుతుందని భావిస్తున్న తరుణంలో షాకింగ్‌గా సినిమాను పక్కకు పెట్టి, వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. ఇదే నెలలో వినాయక్ దర్శకత్వంలో బాలయ్య సినిమా ప్రారంభం కాబోతుంది. సి కళ్యాణ్ ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సమయంలో ఎన్టీఆర్ సినిమా గురించి సినీ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఎన్టీఆర్ సినిమా తెరకెక్కించాలని బాలయ్య నిర్ణయించుకున్నప్పటి నుండి ఏదో ఒక సమస్య వస్తుంది. స్క్రిప్ట్ వర్క్‌కు ఏకంగా ఆరు నెలల సమయం తీసుకున్నాడు. దానికి తోడు సినిమా చేస్తానంటు ముందుకు వచ్చిన తేజ స్క్రిప్ట్‌లో మళ్లీ మార్పులు చేయాలని, లేదంటూ తాను ఈ సినిమాను చేయను అంటూ చెప్పడంతో చిరాకెత్తిన బాలయ్య తేజను సాగనంపాడు. తేజ వెళ్లి పోయిన తర్వాత ఎంతో మంది దర్శకుల పేర్లను పరిశీలించిన బాలయ్య తానే సినిమాను చేయాలని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో నిజం లేదని తర్వాత వెళ్లడైంది. తాజాగా వినాయక్‌తో సినిమాను బాలయ్య మొదలు పెట్టడంతో అసలు ఎన్టీఆర్ సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఎన్టీఆర్ సినిమాను బాలయ్య పక్కకు పెట్టాడని భావిస్తుంటే మరి కొందరు మాత్రం పూర్తిగా పడేశాడు అంటూ గుసగుసలాడుకుంటున్నారు. రెంటిలో ఏది నిజమో ఆయనే చెప్పాలి.