బ్లేడుతో గొంతు గోసుకుంటా – బండ్ల గణేష్ మరో శపథం

Bandla Ganesh Will Commit Suicide If Congress Does Not Come To Power

“బండ్ల గణేష్ అనే నేను శాసనం ద్వారా శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర శాసన సభ్యుడిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతః కరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ, పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని నా తెలంగాణ ప్రజల సాక్షిగా ప్రమాణం చేయబోతున్నాను” అని తనకి అభ్యర్థిగా టిక్కెట్ రాకమునుపే మీడియా ఇంటర్వ్యూ లలో ప్రమాణం చేసిన బండ్ల గణేష్ కాన్ఫిడెన్సుకి ఇదేదో పొద్దుపోకముందే కోడి కూత కూసినట్టుందిరో అని చాలామంది నవ్వుకున్నా, ఇంత ధైర్యం గా చెప్తున్నాడు అంటే ఏదైనా మంచి బ్యాకింగ్ ఉండుంటుందిలే అని అనుకున్నవారు లేకపోలేదు. తెలంగాణ అసెంబ్లీ లో ఎమ్మెల్యే గా ప్రమాణస్వీకారం చేయడానికి ఉవ్విళ్లూరుతున్న బండ్ల గణేష్ ఆశల కుంపటికి కాంగ్రెస్ పార్టీ నీళ్లుపోసేసింది.

bandla-ganesh

ఇంకేముంది…కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నాలుగు జాబితాలలో కూడా అభ్యర్థిగా పేరు లేకపోయేసరికి బండ్ల గణేష్ గాలి మొత్తం ఒక్కసారే పోయింది. ఏదో కంటి తూడుపు చర్యగా తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అనే ఆటలో అరటిపండు పదవిని ఒకటి ఇచ్చి, పక్కన కూర్చోపెట్టేసరికి ఏమిచేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉన్న బండ్ల గణేష్ మాత్రం తన కాంఫిడెన్స్ ని పోగొట్టుకోలేదు సరికదా అడిగిందే తడవుగా మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఎటువంటి మొహమాటాలకు పోకుండా. నిన్న టీవీ9 మురళి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన బండ్ల గణేష్ తనని కాంగ్రెస్ పార్టీ బకరా ఏమి చేయలేదని, ఎప్పటినుండో ఉంటున్న కాంగ్రెస్ నేతలకే సీట్లు రాలేదని, చేరి ముప్ఫైరోజులు కూడా కానీ నాకు సీటు రాకపోవడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదని, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని వీడేదిలేదని, అధిష్టానం ఆదేశిస్తే ప్రచారానికి సిద్ధంగా ఉన్నానని, డిసెంబర్ 12 న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే మురళి గారిని 7 ఓ క్లాక్ బ్లేడు తీసుకురమ్మని చెప్పి, ఆ బ్లేడుతోనే గొంతుకోసుకుంటానని శపథం చేశాడు. అంతపెద్ద శపథం ఎందుకు చేశావయ్యా అంటే గొంతు కోసుకునే సందర్భం రాదని, డిసెంబర్ 12 న తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేది మహాకూటమి అని మరోసారి తన కాంఫిడెన్స్ ని వ్యక్తపరిచాడు బండ్ల గణేష్. మరి ప్రమాణం సంగతేమిటి అడిగిన మరో ప్రశ్నకి, మహాకూటమి అధికారంలోకి వచ్చేరోజు కోసం కొత్త ప్రమాణం రాస్తున్నానని, అది తమ పార్టీ నాయకుల చేత చెప్పిస్తానని కూడా చెప్పాడు బండ్ల గణేష్. ఏదేమైనా అసలు అభ్యర్థుల లిస్ట్ ప్రకటించకముందే, తనకి టిక్కెట్ రాకముందే ఎమ్మెల్యే గా ప్రమాణస్వీకారం చేసిన బండ్ల గణేష్ అత్యుత్సాహం చూస్తుంటే, ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న సామెత గుర్తొస్తుంది అందరికీ.