Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రధాని మోడీ నుంచి అక్షింతలు పడినా… త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్ తీరులో ఏ మాత్రం మార్పురాలేదు… వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకు అలవాటుగా మారింది. తాజాగా తన ప్రభుత్వం సొరకాయలాంటిది కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. త్రిపుర రాజధాని అగర్తలాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న బిప్లబ్ ఎవ్వరూ తన ప్రభుత్వంపై చెయ్యి వెయ్యలేరని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తనది కాదని, ప్రజలదని, తన ప్రజలపై చెయ్యి ఎత్తే ధైర్యం ఎవరికీ లేదని అన్నారు. సొరకాయ మాదిరిగానే ప్రభుత్వ సొమ్ముతో ఏమైనా చేయొచ్చని చిన్నప్పుడు తనకు చాలా మంది చెప్పేవారని అన్న బిప్లబ్ దేబ్… అలా సొరకాయతో ప్రభుత్వాన్ని ఎందుకు పోలుస్తారో కూడా వివరించారు.
ఓ కూరగాయలు అమ్ముకునే వ్యక్తి దగ్గర సొరకాయలు ఉంటే కొనడానికి వచ్చిన వారంతా అది బాగానే ఉందా లేదా అని పరీక్షించేందుకు గోళ్లతో గిల్లి చూస్తారని, అలా చాలా మంది చేస్తుంటారని, దీని వల్ల ఆ సొరకాయపై గాట్లు పడి అది ఎందుకూ పనికిరాకుండా పోతుందని, ఇక దాన్ని ఎవ్వరూ కొనుక్కోరని బిప్లబ్ దేబ్ చెప్పుకొచ్చారు. అలా… సొరకాయకు పెట్టినట్టుగా… తన ప్రభుత్వంపై ఎవరూ ఘాట్లు పెట్టడానికి వీల్లేదని, అలా చేస్తే వాళ్ల గోళ్లు కత్తిరించివేస్తానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
కొన్నిరోజులుగా ఇలా వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న బిప్లబ్ దేబ్ ను మోడీ హెచ్చరించారు. అయితే బిప్లబ్ మాత్రం ప్రధాని తనను కొడుకులా ప్రేమిస్తారని, మోడీ తనను ఢిల్లీ రమ్మన్నారన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. మొత్తానికి కమ్యూనిస్టుల కంచుకోటను బద్ధలు కొట్టి అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఆ సంతోషం ఎక్కువరోజులు ఉండకుండా… తన వ్యాఖ్యలతో బిప్లబ్ దేబ్ ఇరుకున్న పెడుతున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.