Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ ప్రజలంతా ఒక్కటవుతున్న వేళ బీజేపీలో అసహనం పెరుగుతోంది. క్రమశిక్షణ, సహనం ఉన్న పార్టీగా పేరున్న బీజేపీ ఇప్పుడు విద్వంసక రాజకీయాలకు దిగుతూ విమర్శలు కొనితెచ్చుకుంటోంది. విజయవాడలో ప్రత్యేక హోదాపై జరిగిన ఓ చర్చ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు సహనం కోల్పోయారు. సినీ నటుడు, ఒకప్పుడు బీజేపీకి మద్దతు పలికన శివాజీ ప్రత్యేక హోదాపై గట్టిగా ప్రశ్నించినందుకు ఆయనపై దాడికి దిగారు. చర్చలో భాగంగా ఏపీ విషయంలో మోడీ వైఖరిని శివాజీ తూర్పారబట్టారు. మోడీ జీరో… మోడీ జీరో అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో కల్పించుకున్న బీజేపీ కార్యకర్తలు శివాజీ డౌన్ డౌన్ అని పెద్ద పెట్టున నినదించారు. శివాజీ ఆగ్రహంతో ప్రజలు మిమ్నల్నింకా మాట్లాడనిస్తున్నారని, ఇంకా ఇదే పరిస్థితి ఉంటే తరిమికొడతారని హెచ్చరించారు. ఆ మాటలతో సహనం కోల్పోయిన బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా శివాజీపై భౌతిక దాడికి దిగారు.
అక్కడే ఉన్న ప్రజాసంఘాలు, ప్రజలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీజేపీ కార్యకర్తల తీరుపై శివాజీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తనపై ఎగబడినా వెనక్కు పోయే మనిషిని కాదని, తన మీద జరిగే దాడి ప్రతి తెలుగువాడిమీద జరిగే దాడని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఇదే బీజేపీకోసం 2014లో తాను కుక్కలా ఇల్లిల్లూ తిరిగి ఓట్లడిగానని ఆవేదన వ్యక్తంచేశారు. విభజనతో నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ తో పాటు పలు ఫ్యాక్టరీలు, విద్యాసంస్థలను తాము అధికారంలోకి వస్తే ఇస్తామని మోడీ చెప్పిన మాటలు నమ్మి తాను 2014 ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చానని అన్నారు. తాను బీజేపీలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నవారెవరూ లేరని, స్వార్థ ప్రయోజనాల కోసం ఇక్కడకు వచ్చి గొడవ చేస్తున్నారని మండిపడ్డారు. తనపై దాడిచేసినా… చంపినా… తనవంటి వారు వందలమంది పుడతారని, వారి ఆగ్రహానికి బీజేపీ నాశనమవుతుందని హెచ్చరించారు. గతంలో బీజేపీకి ఇలా దాడులు చేసే సంస్కృతి లేదని, ఇప్పుడు కొత్తగా ఆ సంస్కృతి తీసుకొచ్చారని విమర్శించారు. విజయవాడలో ఆరెస్సెస్ సోదరులతో తనకు పరిచయాలు ఉన్నాయని, గతంలో ఎన్నడూ క్రమశిక్షణ తప్పనివారు ఇప్పుడు ఇలా ఎందుకు అసహనం పెంచుకుంటున్నారని ప్రశ్నించారు. ఇదా భారతీయ జనతా పార్టీ… ఇలాగేనా మీరు చేసేది? దమ్ముంటే, మీకు చేతనైతే… బీజేపీ వాదనను ప్రజలకు వివరంగా చెప్పాలని, లేకుంటే తప్పు ఒప్పుకోవాలని శివాజీ సవాల్ చేశారు.