Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక్కతాటిపైకి వస్తున్న వేళ… బీజేపీ కపట రాజకీయాలకు తెరలేపింది. రాయలసీమ డిక్లరేషన్ పేరుతో ఏపీ ప్రజల్లో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోంది. కేంద్రప్రభుత్వం కనుసన్నల్లో రాష్ట్ర బీజేపీ నేతలు విభజన రాజకీయాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే కర్నూల్ లో జరిగిన సమావేశంలో ఏపీ బీజేపీ నేతలు రాయలసీమకు సంబంధించిన డిక్లరేషన్ ప్రకటించారు. రాష్ట్ర రెండో రాజధానిని రాయలసీమలో ఏర్పాటుచేయడం, సీమ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటుచేయడం, రాయలసీమలో ఉన్న నాలుగు జిల్లాలను ఎనిమిది జిల్లాలుగా విభజించడం, సీమ ఇరిగేషన్ కు రూ. 10వేల కోట్లు కేటాయించడం, వచ్చే బడ్జెట్ లో రాయలసీమకు రూ. 20వేల కోట్ల ప్రత్యేక నిధి కేటాయించడం, రాయలసీమ అభివృద్ధి బోర్డు ఏర్పాటుచేయడం, ఆరునెలలకోసారి రాయలసీమలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం… డిక్లరేషన్ లోని ప్రధాన అంశాలివి.
డిక్లరేషన్ తర్వాత బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాయలసీమను టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. అమరావతిని మరో హైదరాబాద్ చేయవద్దన్నారు. డిక్లరేషన్ లోని డిమాండ్లు సాధించే క్రమంలో ఈ నెల 28వతేదీ నుంచి కడప జిల్లాలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని నేతలు తెలిపారు. బీజేపీ నేతలు ప్రకటించిన ఈ డిక్లరేషన్ స్వార్థ రాజకీయప్రయోజనాల కోసం తెరపైకి తెచ్చిందే అని పలువురు విశ్లేషిస్తున్నారు. నిజానికి నవ్యాంధ్రలో టీడీపీ ప్రభుత్వం అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తోంది. అదే సమయంలో వెనుకబడిన రాయలసీమకు అమిత ప్రాధాన్యం ఇస్తోంది. ఏపీకే తలమానికంగా భావిస్తున్న పలు పరిశ్రమలను రాయలసీమలో ఏర్పాటు చేస్తోంది. కియా కార్ల పరిశ్రమ ఇన్ స్టలేషన్ ప్రారంభం ఇందుకు ఓ ఉదాహరణ. రాష్ట్ర ప్రభుత్వం కడప, కర్నూల్, అనంతపురం, చిత్తూరుల్లో ఏర్పాటుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను దగ్గరుండి గమనిస్తూ కూడా బీజేపీ సీమ ప్రజలను రెచ్చగొట్టేలా డిక్లరేషన్ ను తెరపైకి తేవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.