Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టీడీపీకి, బీజేపీకి పొత్తు ఉందా… ఇకముందు ఉంటుందా…? నంద్యాల రాజకీయాల తీరు తెన్నులను పరిశీలిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందేహం రాకమానదు.. మిత్రపక్షాలంటే ఉప ఎన్నిక నుంచి స్థానిక ఎన్నికల దాకా వేటినైనా కలిసే పోటీచేయాలి. కలిసే ప్రచార బాధ్యతలు నిర్వహించుకోవాలి. కానీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన తరువాత ఒక్కసారి కూడా బీజేపీ నేతలు నంద్యాల లో కనిపించలేదు. టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఒక్క సభలో అయినా పాల్గొనలేదు. టీడీపీకి ఓటు వేయాలని ఒక్క ఓటరునయినా బీజేపీ స్థానిక, రాష్ట్రనేతలెవరూ అడిగిన పాపాన పోలేదు. ఏమిటి దీనర్థం…రాష్ట్రంలో కొద్దిరోజులుగా చర్చ జరుగుతున్నట్టుగా టీడీపీ, బీజేపీ బంధం ఇక ముగిసిపోయినట్టేనా…ప్రస్తుత పరిస్థితులని చూస్తుంటే అవుననే చెప్పాలి.
అయితే చంద్రబాబు బీజేపీని దూరం పెడుతున్నారా…లేక బీజేపీనే జగన్ తో అంటకాగాలనే ఉద్దేశంతో చంద్రబాబును దూరంగా ఉంచుతోందా… వాస్తవానికి చంద్రబాబు బీజేపీపై కాస్త గుర్రుగానే ఉన్నారు. తాను విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో జగన్ తో మోడీ భేటీ కావటంపై చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నిధుల కేటాయింపు పైనా కేంద్రం ఏపీని చిన్నచూపు చూస్తోందనే భావన చంద్రబాబులో నెలకొంది. ఈ విషయాలపై ప్రజల్లోనూ బీజేపీ తీరు మీద ఆగ్రహం వ్యక్తమవుతోంది. కానీ రాష్ట్ర అవసరాల కోసం పొత్తును కొనసాగించక తప్పని పరిస్థితి బాబుది. అయితే మోడీ, అమిత్ షా ద్వయం అన్ని రాష్ట్రాల్లోలానే ఏపీలోనూ సొంతంగా ఎదగటంపై దృష్టిపెట్టారు. బాబుకు దూరంగా జరగాలన్న ఉద్దేశ్యంతో నే టీడీపీ, బీజేపీ సంబంధాల మధ్య కీలక పాత్ర పోషించే వెంకయ్య నాయుడిని మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల నుంచి తప్పించి ఉపరాష్ట్రపతిని చేశారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే బీజేపీ చంద్రబాబును పక్కనపెట్టిందో లేదో తెలియదు కానీ…చంద్రబాబు మాత్రం నంద్యాల ఉప ఎన్నిక వరకు బీజేపీని ఆఫ్ లైన్ లో ఉంచారు.
నంద్యాల నియోజక వర్గంలో ముస్లిం, దళితుల ఓటు బ్యాంకు అధికం. బీజేపీని ప్రచారానికి రానిస్తే ఆ రెండు వర్గాలు తమకు దూరం కావొచ్చన్న భయంతోనే చంద్రబాబు బీజేపీని దూరం ఉంచారన్న ప్రచారం జరుగుతోంది. కారణం ఏమయినా కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే మాత్రం టీడీపీ, బీజేపీ మధ్య బంధం ముగిసిపోయినట్టే కనిపిస్తోంది. కానీ ఇప్పటికీ రాష్ట్రంలో బీజేపీ.. టీడీపీ మంత్రివర్గంలో, కేంద్రంలో ఎన్డీయేలో టీడీపీ కొనసాగుతుండటంతో ఇప్పుడప్పుడే ఈ చెలిమికి ఫుల్ స్టాప్ పడదని , 2019 ఎన్నికలకు ముందు మాత్రమే కొత్త పొత్తులు ఖరారయ్యే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వార్తలు: