Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలవడం బీజేపీ కి ఎంత ముఖ్యమో, కాదో తెలియదు గానీ ఏపీ రాజకీయాలకి వచ్చేసరికి అది చాలా పెద్ద విషయం కాబోతోంది. వెంకయ్య క్రియాశీలంగా లేని బీజేపీ లో పెనుమార్పులు వస్తాయని ప్రచారం సాగుతోంది. పార్టీలో వెంకయ్య దూకుడుకి తట్టుకోలేక పోయిన వాళ్లంతా ఇక కొత్త ఉత్సాహంతో ఉరకలేస్తారు. అయితే ఆ ఉత్సాహం కన్నా హైకమాండ్ ఎంతగా వారికి ప్రోత్సాహం ఇస్తుందన్నదే ముఖ్యం. అమిత్ షా నేతృత్వంలో బీజేపీ ఎదురుదాడి, దూకుడు అస్త్రాలుగా మలుచుకుని దేశమంతా విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఆ పాచిక ఉత్తరాదిన పారినట్టు దక్షిణాదిన పారడం లేదు. అయినా బీజేపీ ప్రయత్నాలు పాత పద్ధతిలోనే సాగుతున్నాయి.
కొన్నాళ్లుగా బీజేపీ హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చూస్తున్న వారికి ఆ పార్టీ టీడీపీ కి దూరంగా జరిగి, వైసీపీ కి దగ్గరై ఎదగాలని భావిస్తున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో బీజేపీ ఇస్తున్న సంకేతాల కన్నా వైసీపీ చూపిస్తున్న ఆత్రమే ఎక్కువగా హై లైట్ అవుతోంది. ఈ ఆత్రం చూసి టీడీపీ లో కొందరు నాయకులు ఆగ్రహిస్తుంటే ఇంకొందరు నేతలు మాత్రం మోడీని ఢీకొట్టాల్సి వస్తే ఎదురయ్యే పరిస్థితులు చూసి డీలా పడుతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం మనసులో ఏముందో బయటపడకుండా గుంభనగా వ్యవహరిస్తున్నారు. అంత మాత్రాన ఆయన ఈ విషయాల్ని పట్టించుకోవడం లేదు అనుకోడానికి వీల్లేదు. అందుకే అక్కడ బీజేపీ వెంకయ్యని ఉప రాష్ట్రపతి పదవి చూపి పక్కకి పెడుతుండగానే ఇక్కడ జనసేన అధినేత పవన్ తో సీఎం చంద్రబాబు అపాయింట్ మెంట్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 31 న వీరి మధ్య జరగబోయే భేటీ బయటికి ఉద్దానం బాధితుల వ్యవహారం అయినప్పటికీ లోన రాజకీయ చర్చలు జరక్కుండా ఉంటాయా ? ప్రత్యేక హోదా అంశంలో బీజేపీ ని తూర్పారబట్టిన పవన్ టీడీపీ ని మాత్రం ఆ రేంజ్ లో టార్గెట్ చేయలేదు. ఒకవేళ టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు వస్తే ఆయన బాబు వైపే మొగ్గుతారని రాజకీయ పరిశీలకుల అంచనా. ఆ విషయాన్ని చూఛాయగా బీజేపీ కి తెలియజెప్పడానికే పవన్ తో బాబు భేటీ అవుతున్నారన్న వాదనలు లేకపోలేదు.
అటు బీజేపీని కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. టీడీపీ తో మిత్రత్వం కొనసాగిస్తూనే వైసీపీ కి అప్పుడప్పుడూ కన్ను కొడుతూ కవ్వింపులకి దిగుతోంది. అయితే ఈ కవ్వింపులు ఆధిపత్యం సాధించడానికా లేక సొంతంగా ఎదగడానికా అన్నదానిపై క్లారిటీ రాలేదు. బీజేపీ కూడా ఈ విషయంలో ఇంకా స్పష్టత తెచ్చుకున్నట్టు లేదు. అయితే ఇక్కడితో బీజేపీ రాజకీయాలు ఆగిపోలేదు. వెంకయ్య తో హోదా అంశంలో ఢీకొట్టిన పవన్ ని దగ్గర చేసుకోడానికి కూడా ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడతామన్న హామీతో కాపు ఓటు బ్యాంకుని పార్టీ వైపు ఆకర్షించడానికి బీజేపీ వ్యూహకర్తలు ట్రై చేస్తున్నారు . అయితే పవన్ బీజేపీ లో చేరడు కాబట్టి పొత్తులతో ఆ ప్రణాళిక అమలు చేస్తే ఎలా ఉంటుందన్నదానిపై కమలనాధులు ఆలోచిస్తున్నారు. అయితే ప్రత్యేక హోదా అంశంలో ఇన్ని తిట్లు తిట్టి మళ్ళీ బీజేపీ వైపు చూసేందుకు పవన్ పెద్ద ఆసక్తిగా లేరని తెలుస్తోంది. ఏది ఏమైనా ఏపీ విషయంలో టీడీపీ,వైసీపీ, జనసేన తో బీజేపీ ముక్కోణపు ప్రేమ కథ నడిపిస్తోంది. ఈ ప్రేమకథలో ఎవరెవరు కలుస్తారో, ఎవరెవరు విడిపోతారో తేలాలంటే 2019 ఎన్నికల దాకా వేచి చూడాల్సిందే.
మరిన్ని వార్తలు