Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలు చూసాక 2019 ఎన్నికల తర్వాత తానే సీఎం నమ్మకం వైసీపీ అధినేత జగన్ లో సడలిపోయింది. అంత మాత్రాన ముందే కాడి పడేయకూడదు. అందుకే అంతకంతకు కుంగిపోతున్న కాంగ్రెస్ రా రమ్మంటున్నా పట్టించుకోకుండా డబల్ గేమ్ ఆడుతున్న బీజేపీ ప్రాపకం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అవసరమైతే ఓ మెట్టు దిగడానికి కూడా సిద్ధపడుతున్నారు. అలాంటి ఓ ప్రయత్నం ఈ దుర్గాష్టమి రోజు జగన్ చేసినట్టు ఆంధ్రజ్యోతి ఇచ్చిన ఓ కధనం సంచలనం రేపుతోంది.
బీజేపీ తో పొత్తు కోసం ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసిన జగన్ దుర్గాష్టమి రోజు కూడా ఓ మెట్టు దిగి ఓ బీజేపీ ఎంపీ కొడుకు ఇంటి మెట్టు ఎక్కాడని ఆ కథన సారాంశం. అక్కడ rss , vhp నేతల తో జగన్ భేటీ అయ్యారట. తనని ఈ కష్టాల నుంచి బయటపడేస్తే 2019 ఎన్నికల్లో బీజేపీ అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి రెడీ గా ఉన్నట్టు జగన్ వారికి వివరించారట. చంద్రబాబు తో స్నేహం చేస్తే టీడీపీ అన్ని స్థానాలు ఇవ్వదన్న క్లారిటీ ఉండటంతో జగన్ ఆఫర్ నిజంగానే బీజేపీ ని కూడా ఊరిస్తోంది. అయితే ఈ ఇద్దరూ తమ అవసరాలు, ఆశలతో ఓ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. రాజకీయాల్లో ఎత్తులు మాత్రమే వుండవు. పై ఎత్తులు కూడా ఉంటాయి. ఈ రెండు పార్టీలు ఒక్కటైతే గెలుపు ఏమీ గ్యారంటీ కాదు. చంద్రబాబు ఏమీ చిన్నపిల్లాడు కాదు. టీడీపీ ఇచ్చిన కొద్దిపాటి సీట్లు గెలవలేక బీజేపీ నానాతంటాలు పడిన విషయం అందరికీ గుర్తు వుండే ఉంటుంది. 2014 లో 13 సీట్లు ఇస్తే వాళ్ళు గెలిచింది 4 మాత్రమే. ఆ నాలుగు కూడా విశాఖ మొదలుకుని కృష్ణా దాకా జిల్లాకి ఒకటి చొప్పున. మిగిలిన చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు నామమాత్రపు పోటీ ఇచ్చారంతే. ఆ ఫలితాలు సరే కోస్తాలో ఆ పార్టీ పరిస్థితి బాగుంది అనుకుంటే ఇటీవల కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు చూసాక ఆ నమ్మకం కూడా పోయింది. మొత్తం 9 స్థానాలు ఇస్తే గెలిచింది మూడు. అందులో ఇద్దరూ చివరి నిమిషంలో వైసీపీ నుంచి బీజేపీ లో చేరిన వాళ్ళు.
ఎదురుగా బీజేపీ బలం ఎంతో తేటతెల్లం చేసే ఇన్ని సాక్ష్యాలు వున్నా అడిగినన్ని సీట్లు ఇస్తామని జగన్, తీసుకుని ఏపీలో కూడా మా పార్టీ పెద్దదే అని చెప్పుకోడానికి తహతహలాడుతున్నట్టు వుంది. ఈ వ్యవహారం చూస్తుంటే ఇంకో డౌట్ కూడా వస్తోంది. ఏపీ లో రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నంత వరకు ఏపీ లో చోటు లేదని తెలుసుకున్న బీజేపీ ముందుగా ఎవరో ఒకరిని దెబ్బ వేయాలి అనుకుంటోంది. అధికారంలో వున్న టీడీపీ ని దెబ్బ తీయడం కష్టం కాబట్టి, వైసీపీ చెంత చేరి ఎక్కువ సీట్లు తీసుకుని 2019 లో ఆ పార్టీ ఓడిపోయేలా చేస్తే ఇక తమకు ఎదురు ఉండదని కమలనాధులు భావిస్తూ ఉండొచ్చు. వైసీపీ కి ఇంకో పరాజయం ఎదురైతే కకావికలమైన ఆ పార్టీ శ్రేణుల్ని దగ్గరకు తీసుకుని బలపడాలని బీజేపీ అనుకుంటూ ఉండొచ్చు. అదే నిజమైతే బీజేపీ చేతిలో వైసీపీ కి వెన్నుపోటు తప్పదు.