Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎవర్ గ్రీన్ హీరోయిన్ రేఖ ఐశ్వర్యారాయ్ కు ఓ లేఖ రాసింది. ఐశ్వర్యారాయ్ బాలీవుడ్ లో ప్రవేశించి 20 ఏళ్లయిన సందర్బంగా రేఖ ఈ లేఖ రాసింది. లేఖ నిండా ఐశ్వర్యపై ప్రశంసల వర్షం కురిపించింది. ప్రియమైన ఐష్ అని సంబోధించిన రేఖ…అప్పుడే 20 ఏళ్లు పూర్తయిపోయాయా…వావ్..అంటూ ఆశ్చర్యం వ్యక్తంచేసింది. ఐశ్వర్య ప్రవహించే నదిలాంటిదని, నదిలాగే ఎక్కడకు కావాలంటే అక్కడకు చేరుకోగలదని కొనియాడింది.
ఐశ్వర్య ఏం చెప్పిందన్నది, చేసిందన్నది జనం మర్చిపోవచ్చని, అయితే వారికి ఎలాంటి ఫీలింగ్ కల్గించిందన్నది మాత్రం ఎప్పటికీ మర్చిపోరని రేఖ ప్రశంసించింది. ఏదైనా సాధించాలంటే ఉండాల్సిన అతిముఖ్యమైన లక్షణం ధైర్యమని, ఆ ధైర్యం లేకపోతే ఎందులోనూ నైపుణ్యం సాధించలేమని, ధైర్యానికి ఐశ్వర్య సరైన ఉదాహరణ అని అభివర్ణించింది.
ఐశ్వర్య నోరు తెరిచి మాట్లాడేలోపే తన నమ్మకం, తన శక్తి మనతో మాట్లాడేస్తాయని, ఐశ్వర్య అనుకున్నవన్నీ సాధించిందని, అది కూడా అందరి కళ్లూ తన నుంచి మరల్చుకోలేనంత అందంగా సాధించిందని రేఖ గుర్తుచేసింది. ఐశ్వర్య ఎన్నో కష్టాలు అనుభవించిందని, ఫీనిక్స్ పక్షిలా వాటన్నింటినీ దాటి పైకి ఎదిగిందని, ఐశ్వర్యను చూసి తానెంత గర్వపడుతున్నానన్నది మాటల్లో వర్ణించలేకపోతున్నానని రేఖ చెప్పుకొచ్చింది.
ఐశ్వర్య వెండితెరపై ఎన్నో పాత్రలు పోషించిందని, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనిపించిందని, అయితే ఐశ్వర్య చేసిన అన్ని పాత్రల్లో తనకు ఇష్టమైన పాత్ర ప్రస్తుతం పోషిస్తున్న ఆరాధ్యకు తల్లి పాత్ర అని రేఖ తెలిపింది. ఆరాధ్యను ప్రేమిస్తూనే ఉండాలని, తన మ్యాజిక్ ను పంచుతూనే ఉండాలని, ఐశ్వర్య హృదయం మోయలేనన్ని, పట్టలేనన్ని శుభాకాంక్షలు, ఆశీర్వచనాలు, లవ్ యూ జీతేరహో అంటూ రేఖ లేఖను ముగించింది.