Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కృష్ణజింకలను వేటాడిన కేసులో జోధ్ పూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సల్మాన్ ఖాన్ కు పలువురు బాలీవుడ్ ప్రముఖులు అండగా నిలబడుతున్నారు. ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ జోధ్ పూర్ కోర్టు తీర్పు ఇచ్చిన దగ్గరనుంచి పలువురు ప్రముఖులు ముంబైలోని సల్మాన్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. సల్మాన్ తో కలిసి దబాంగ్ లో నటించిన హీరోయిన్ సోనాక్షి సిన్హా, ఆమె తండ్రి, బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హా కూడా సల్మాన్ కుటుంబ సభ్యులను కలిశారు. సల్మాన్ కు శిక్ష విధించడంపై శతృఘ్న సిన్హా ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన చేసిన నేరం ఏమిటని ప్రశ్నించారు? గత 20 ఏళ్లగా..ఈ కేసులో సల్మాన్ కోర్టులు చుట్టూ తిరుగుతూ ఎంతో కుమిలిపోయారని, ఇప్పుడు మరో ఐదేళ్ల శిక్ష వేశారని, అంటే మొత్తంగా 25 ఏళ్లని, తనకు తెలిసి ఆయన ఓ పెద్ద స్టార్ అనే ఇంత పెద్ద శిక్ష వేసి ఉంటారని భావిస్తున్నానని శతృఘ్న సిన్హా వ్యాఖ్యానించారు.
ఒకవేళ ఆయన సామాన్య వ్యక్తి అయితే నేరం చేసింది, చేయనిది పక్కనబెడితే ఇలా 25 ఏళ్లు బాధపడేవారు కాదేమో అని అభిప్రాయపడ్డారు. సల్మాన్ ఎంతో దయార్ద్ర హృదయుడని, అవసరంలో ఉన్న వారికి వెంటనే సాయం చేస్తాడని, ఆయన బయట ఉంటే ఎన్నో మంచి పనులు చేస్తాడని, శిక్ష వేయాలనుకుంటే సమాజ సేవ చేయమని వేయాలని శతృఘ్న సిన్హా సూచించారు. అయితే శతృఘ్న సిన్హాతో పాటు పలువురు ప్రముఖులు, అభిమానులు సల్మాన్ కు ఇస్తున్న మద్దతుపై సామాన్య జనంలో మాత్రం ఆగ్రహం వ్యక్తమవుతోంది.
సల్మాన్ మంచివాడు, అవసరంలో ఉన్నవారికి సాయం చేస్తాడు, ఆయన జైల్లో ఉంటే ఆయన నటిస్తున్న ప్రాజెక్టులు ఆగిపోయి బాలీవుడ్ కు వందలకోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది…వంటి కారణాలతో శిక్ష ఎందుకు తగ్గించాలని ….కొన్ని తీవ్రమైన నేరాలు చేసి…ఆ తర్వాత చిన్న చిన్న మంచిపనులు చేస్తే..ఆ నేరాల తీవ్రత తగ్గుతుందా అని…నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా శిక్ష విధించే సమయంలో కోర్టులు నేరస్థుని గత చరిత్రను పరిగణనలోకి తీసుకుంటాయి. సల్మాన్ విషయంలోనూ గత చరిత్రను పరిశీలించిన న్యాయమూర్తి…నేరాలు అలవాటైన వ్యక్తి అని వ్యాఖ్యానించారు. 2002లో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వారిపైకి మద్యంమత్తులో కారు ఎక్కించి అమాయకుల ప్రాణాలు పొట్టనపెట్టుకున్న సల్మాన్ గత చరిత్రను పరిశీలించే న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి చూస్తే.. కృష్ణజింకలు వేటాడిన కేసు తీవ్రమైనది కావడంతో పాటు..గత చరిత్ర దృష్ట్యా కూడా..సల్మాన్ కు శిక్ష విధించారు కానీ…ఆయన సెలబ్రిటీ కాబట్టి ఇంత శిక్ష విధించారని బాలీవుడ్ సెలబ్రిటీలు అనడం సరైనది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.