లండన్‌లో ఘనంగా బోనాలు

bonalu in london

తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. బోనాల ఉత్సవాలకు ముఖ్య అతిథిగా లండన్‌ ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమా మల్హోత్రా, భారత రాయబారి హాజరయ్యారు. బ్రిటన్‌ నలుమూలల నుంచి సుమారు 600 మందికిపైగా తెలంగాణవాసులు ఈ వేడుకలకు తరలివచ్చారు.

ఈ సందర్భంగా ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి ప్రచారంలో తెలుగువారు మొదటిస్థానంలో ఉన్నారని పేర్కొన్నారు. గత ఎనిమిదేళ్ల నుంచి ఇక్కడ నిర్వహించే బోనాల ఉత్సవాల్లో పాల్గొనడం గర్వంగా ఉందన్నారు. ఎంపీ సీమా మల్హోత్రా మాట్లాడుతూ.. ఇంగ్లండ్‌ గడ్డపై తన నియోజకవర్గంలో బోనాల పండుగ నిర్వహించడం, హిందూ సంప్రదాయాల్లో తాను భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని చెప్పారు. తెలంగాణ ఎన్నారై ఫోరం చైర్మన్‌ గంప వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. 2011లో తొలిసారిగా లండన్‌లో బోనాల వేడుకలు నిర్వహించామని గుర్తు చేశారు. నాటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి ఏడాది బోనాల పండుగ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా బోనాల వేడుకలు నిర్వహించడం శుభపరిణామం అన్నారు.

ఈ కార్యక్రమంలో మహేష్ జమ్ముల, స్వామి ఆశ, వెంకట్ ఆకుల, మహేష్ చట్ల, బాలకృష్ణ రెడ్డి, శేషు అల్ల, నరేంద్ర వర్మ, సాయి మార్గ్, మీనాక్షి అంతటి, వాణి అనసూరి, శ్రీవాణీ, సవిత, సీత, శౌరి, దివ్య, సాయి లక్ష్మి, శిరీష, అశోక్ మేడిశెట్టి, నర్సింహా రెడ్డి తిరుపరి, రాజు కొయ్యడ, రవి కూర, నరేందర్, మల్లేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.