బి‌ఆర్‌ఎస్ పార్టీ వర్సెస్ గవర్నర్..పోలిటికల్ గేమ్ మళ్లి వేడెక్కింది?

BRS Party Vs Governor..Political game heated up again?
BRS Party Vs Governor..Political game heated up again?

మళ్ళీ తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ అన్నట్లు పోరు మొదలైంది. ఇటీవలే కొన్ని బిల్లుల ఆమోదం విషయంలో పెద్ద రచ్చ నడిచింది. అయినా ఎప్పటినుంచో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల అభ్యర్ధిత్వాలని గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌కుమార్‌, కుర్రా సత్యనారాయణను నామినేట్‌ చేయాలంటూ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్‌ తమిళిసై తిరస్కరించారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం వివిధ రంగాల్లో విశేష కృషి చేసినవారినే గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేయాల్సి ఉంటుందని, ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ఇద్దరికి అటువంటి అర్హతలు లేవని, ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసేందుకు వారు అనర్హులని స్పష్టం చేశారు.

అయితే ఇలా ఎమ్మెల్సీ అభ్యర్ధులని తిరస్కరించడంపై గవర్నర్ టార్గెట్ గా బి‌ఆర్‌ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. గవర్నర్ తీరు బాధాకరమని,ఫెడరల్ స్పూర్తిగా విరుద్ధమని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. బి‌జే‌పి బి‌సి వ్యతిరేక పార్టీ అంటూ విరుచుకుపడ్డారు. గతంలో పాడి కౌశిక్‌ రెడ్డి విషయంలోనూ ప్రభుత్వానికి ఇదే రకమైన ఎదురు దెబ్బ తగిలింది.

కౌశిక్‌ రెడ్డిని గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రభుత్వం ప్రతిపాదించి గవర్నర్‌కు పంపింది. అప్పుడు గవర్నర్‌, కౌశిక్‌ రెడ్డి ఎక్కడా సేవా కార్యక్రమాలు చేసినట్లు కనిపించలేదని పేర్కొంటూ తిరస్కరించారు. కౌశిక్ పై కేసులు కూడా ఉండటంతో గవర్నర్ తిరస్కరించారు. ఇక గవర్నర్‌ తిరస్కరణ అనంతరం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా కౌశిక్‌ రెడ్డిని ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.ఇప్పుడు శ్రావణ్, కుర్రా సత్యనారాయణల ఎమ్మెల్సీ అభ్యర్ధిత్వాలని సైతం తిరస్కరించడంతో కే‌సి‌ఆర్ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తుందనేది చూడాలి.