ఆదివారం జరిగిన తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఎన్నికల్లో సి.కల్యాణ్ ఘన విజయం సాధించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నిర్మాతల మండలి అధ్యక్ష పదవికిగాను మొత్తం 477 ఓట్లకు సి.కల్యాణ్ 378 ఓట్లు సాధించగా, ప్రత్యర్థిగా పోటీ చేసిన ప్రతాని రామకృష్ణగౌడ్‌కు 95 ఓట్లు వచ్చాయి. వైస్ ప్రెసిడెంట్స్‌గా వైవీఎస్ చౌదరి (360 ఓట్లు), కె. అశోక్‌కుమార్ (317 ఓట్లు) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సి.కల్యాణ్ మాట్లాడుతూ ఎన్నికలు, పోటీ లేకుండా రెండుగా విడిపోయిన నిర్మాతల మండలిని ఏకం చేయాలనే ఆలోచనతో పెద్దలతో చర్చించిన తర్వాత అందరం ఒకేమాట మీద ఉంటూ మన ప్యానల్ తరఫున పోటీ చేశాం. ఎల్ఎల్పీ, గిల్డ్లు లేకుండా నిర్మాతల మండలి ఒకటిగా ఉండాలి. అందరూ ప్రొడ్యూసర్ కౌన్సిల్దారిలోనే నడవాలి.అందుకోసం మేము ఏం చేయడానికైనా, ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి విభేదాలు లేకుండా ఒకటిగా పనిచేస్తాం. ఎన్నికలు పూర్తవగానే మీ వెనుక నేనున్నానంటూ చిరంజీవి మమ్మల్ని అభినందించారు. మంచి పనులు చేయమని సూచించారు. ఆయనతో పాటు పెద్దల సహకారంతో నిర్మాతలకు న్యాయం జరిగేలా కృషి చేస్తాం. అవసరమైతే పదవులు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రెండో కుంపటి వద్దనే నినాదంతో పనిచేస్తాం. నిర్మాతల మండలి ద్వారానే అన్ని కార్యక్రమాలు జరగాలి అని తెలిపారు.