బిగ్‌బాస్-2 కంటెస్టెంట్, హేతువాది బాబు గోగినేనిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయ్యింది. మతవిశ్వాలను కించపరచడం, భారత విదేశాంగ విధానానికి ఆటంకం కలిగించేలా విదేశాల మీద విద్వేషకర వ్యాఖ్యలు చేయటం, ఆధార్ సమాచారాన్ని దుర్వినియోగం చేయడం తదితర ఆరోపణలు చేస్తూ కొంత మంది ఆయన మీద కంప్లైంట్ చేయడంతో ప్రాధమిక అంశాలు పరిశీలించి పోలీసులు 13 సెక్షన్ల కింద బాబు గోగినేనిపై కేసు నమోదు చేశారు. గోప్యత పాటించాల్సిన ఆధార్ సమాచారాన్ని బాబు గోగినేని, ఆయన అనుచరులు, వాళ్ల సంస్థల ద్వారా విదేశాలకు అందజేస్తున్నారని పిర్యాదుదారులు ఆరోపించారు. ఇది ఆయా వ్యక్తులకు నష్టం కలిగించడమే కాకుండా దేశ భద్రతకు కూడా ప్రమాదంగా మారుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్‌కు బాబు గోగినేని ఫౌండర్‌గా ఉన్నారని, మలేషియాలో దీనికి సంబంధించి కార్యక్రమాలు నిర్వహిస్తారని హేతువాద సమావేశాలంటూ గోగినేని బృందం పలువురికి ఆహ్వానం పలికి, వారి నుంచి తప్పనిసరిగా ఆధార్ నెంబర్‌ను తీసుకుంటోందని, ఆ ఆధార్ నెంబర్లను వెబ్సైట్లో బహిర్గతం చేయడం ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా పోయిందని, ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు.
హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నంలో ఇటీవల బాబు గోగినేని ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్లలో పాల్గొన్నవారి ఆధార్ నెంబర్ తీసుకోవడమే కాకుండా.. ఆ నెంబర్లను వెబ్సైట్లో పెట్టారని ఫిర్యాదు చేశారు. సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ అనే సంస్థను బాబు స్థాపించారని, కాని దానికి సంబంధించిన వెబ్సైట్లో మాత్రం చివరన ఎంఎల్ ఉందన్నారు. అంటే ఆ వెబ్సైట్ మలేషియాకు చెందినదై ఉంటుందని, సేకరిస్తున్న డేటా అక్కడికి చేరుతోందనే అనుమానం ఫిర్యాదు దారులు వ్యక్తం చేశారు. ఈ సంస్థ ఆధార్ వివరాలను సేకరించడానికి గల కారణాలపై ఆరా తీయాలని అలాగే టీవీ చానళ్లు, సోషల్ మీడియా ద్వారా బాబు గోగినేని వివిధ మతాల వారి మనోభావాలను కించపరుస్తున్నారని పేర్కొన్నారు. మతపరమైన గ్రంథాలను కూడా అవమానిస్తున్నారని ఆరోపించారు. ఈవెంట్ల పేరిట అమాయకులను మోసం చేసి డబ్బులు కూడా వసూలు చేస్తున్నారన్నారు. సౌదీఅరేబియా తీవ్రవాద దేశమని పేర్కొంటూ దేశాల మధ్య సంబంధాలను దెబ్బ తీసే విధంగా వ్యాఖ్యానిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.