గతంలో విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసుని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే చార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ, ఈ దాడికి నిందితుడు శ్రీనివాసరావే పథకం వేసినట్టు ఆ చార్జ్ షీట్ లో తెలిపింది. జగన్ మీద దాడి చేయాలన్న వ్యూహం శ్రీనివాస్ దేనని ఎన్ఐఏ తేల్చింది. దాన్ని అమలు చేసే ప్రక్రియలో భాగంగా నిందితుడే కోడికత్తిని సమకూర్చుకున్నాడని, ఎయిర్‌పోర్ట్‌కు జగన్ రాకపోకల సమాచారంపై పూర్తి అవగాహన పెంచుకున్నాడని నిర్థరించింది. తాజాగా రాజ్యసభలోనూ ఈ అంశంపై కేంద్రం ఆసక్తికర విషయం వెల్లడించింది.
విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడిలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి చిన్న గాయమే అయినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ జి.ఆహిర్ స్పష్టం చేశారు. బుధవారం రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగిన ఘటన గురించి కేంద్రానికి తెలుసా ? ఒకవేళ తెలిస్తే ఈ దాడి వెనుక ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకోడానికి ప్రభుత్వం ప్రయత్నించిందా? దీనిపై ఇంతవరకూ ఎలాంటి చర్య తీసుకున్నారు? ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి ప్రభుత్వానికున్న అడ్డంకులేంటని విజయసాయిరెడ్డి లిఖితపూర్వకంగా కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్రమంత్రి హన్స్‌రాజ్ స్పందిస్తూ 2018 అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలోని ఫ్యూజన్ ఫుడ్‌రెస్టారెంట్‌లో పనిచేసే సిబ్బంది ఒకరు జగన్మోహన్ రెడ్డిపై దాడిచేశారని, ఆయనకు చిన్నగాయమైందని అన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించామని ఆయన బదులిచ్చారు.