Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పోలవరం ప్రాజెక్టు విషయంలో కుట్ర జరుగుతోందని టీడీపీ ప్రభుత్వం అనుమానిస్తున్న సమయంలో… కేంద్రప్రభుత్వం ఊరటనిచ్చే కబురుచెప్పింది పోలవరానికి నిధులు విడుదల చేసినట్టు ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టు అధారిటీకి తొలివిడతగా రూ. 1098కోట్లు విడుదలచేసినట్టు వెల్లడించింది. త్వరలోనే మరో రూ. 302 కోట్లు విడుదల చేయనున్నట్టు తెలిపింది. అలాగే నాబార్డ్ ద్వారా మరో రూ. 1400 కోట్లను రుణంగా తీసుకునేందుకు ఏపీకి అనుమతి ఇచ్చింది. పోలవరం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకి, బీజేపీకి మధ్య ఏపీ శాసనమండలిలో వాగ్వాదం జరిగిన వెంటనే కేంద్రం నిధులు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
కేంద్ర ప్రభుత్వం వైసీపీ, జనసేనతో కుమ్మక్కయి ఏపీ ప్రజలకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఆపేందుకు కుట్ర పన్నుతోందని ముఖ్యమంత్రి ఆరోపణలు చేయడం, మరో పక్క పోలవరాన్ని ఏపీ ప్రజలు సెంటిమెంట్ గా భావిస్తుండడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లకూడదన్న ఉద్దేశంతోనే కేంద్రం నిధులు విడుదల చేసినట్టు తెలుస్తోంది. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని ప్రజలు దోషిగా చూస్తున్న ప్రస్తుత తరుణంలో పోలవరానికి సాయం చేయడం ద్వారా వ్యతిరేకభావం పోగొట్టుకోవాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.