Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకోసం ఓ పక్క టీడీపీ ఎంపీలు ఆందోళనలు, నిరసనల హోరు కొనసాగిస్తున్నా… కేంద్రప్ర భుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. అదే మొండి వైఖరి కొనసాగిస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించి షాక్ ఇచ్చింది. ప్రత్యేక హోదా కన్నా ఇంతకుముందు ప్రకటించిన ప్యాకేజీ అమలే ఉత్తమమని ఆర్థిక శాఖ పేర్కొంది. అంతేకాదు… ప్యాకేజీ తప్ప మిగిలిన రాయితీలేవీ సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన రాయితీలు ఆంధ్రప్రదేశ్ కు కూడా ఇస్తే… వెనుకబడిన రాష్ట్రాలైన యూపీ, బంగాల్, బీహార్ రాష్ట్రాలు కూడా డిమాండ్ చేసే అవకాశం ఉందని, అందుకే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాకపోవచ్చని తెలిపింది. అంతేకాక ఏపీ ఎంపీలు చేస్తున్న ఆందోళనపైనా అభ్యంతర కర వ్యాఖ్యలు చేసింది.
ఆత్మగౌరవం అంటూ రాజకీయవేడిని పెంచుకుని ఏపీ నేతలు సతమతమవుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇవాళ తెలుగువారి సెంటిమెంట్ అంటున్నారని, ఒకవేళ రాయితీ ఇస్తే తమిళం, మలయాళం సెంటిమెంట్లు కూడా తలెత్తుతాయని, ఇలాంటి సెంటిమెంట్లు పరిగణనలోకి తీసుకోలేమిన స్పష్టంచేసింది. ఏపీకి ప్యాకేజీ అమలు చేయడం ఉత్తమమని, మిగిలినవి సాధ్యం కావని తేల్చిచెప్పిన ఆర్థికశాఖ ఏపీకి ఇచ్చిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా లెక్కలు చెప్పలేదని ఆరోపించింది. కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన చూస్తే… విభజన బాధిత ఏపీకి కేంద్రప్రభుత్వం నుంచి ప్రత్యేక సాయం ఏదీ అందనట్టే లెక్క. ఈ ప్రకటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీఎల్పీ సమావేశంలో దీనిపై చర్చించారు. రాష్ట్రానికి ఏమీ చేయలేమన్న రీతిలో కేంద్రం వ్యవహరిస్తున్నట్టు మీడియాలో వార్తలొస్తున్నాయని… ఈ సమస్యను కేంద్రప్రభుత్వం ఎందుకు జటిలం చేస్తోందో అర్ధం కావడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.