అక్కినేని నాగచైతన్య, సమంతల వివాహం తర్వాత కలిసి నటించబోతున్నట్లుగా గత కొన్ని నెలలుగా మీడియాలో ప్రచారం జరుగుతుంది. పెళ్లికి ముందు మూడు చిత్రాల్లో నటించిన ఈ జంట పెళ్లి తర్వాత సినిమా అనగానే అందరి దృష్టి ఈ చిత్రంపైనే ఉంటుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రంలో సమంతను హీరోయిన్గా తీసుకోవాలని భావించారు. మారుతి కూడా సమంతపై ఆసక్తి చూపించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ కథకు సమంత, నాగచైతన్య కలిసి నటించడం బాగోదనే ఉద్దేశ్యంతో కొందరి సూచన మేరకు ఆ చిత్రం నుండి సమంత తప్పుకుంది. దాంతో ఆ స్థానంలో అను ఎమాన్యూల్ను ఎంపిక చేయడం జరిగింది. ఇక తాజాగా శివ నిర్వాన దర్శకత్వంలో సమంత, నాగచైతన్య జంటగా ఒక చిత్రంకు క్లాప్ పడటం జరిగింది.
‘నిన్ను కోరి’ వంటి విభిన్నమైన మాస్ ఎంటర్టైనర్ను ప్రేక్షకులకు అందించిన దర్శకుడు శివ నిర్వాన ఈ చిత్రంతో మరో ప్రయత్నం చేయబోతున్నాడు. నాగచైతన్య, సమంతలు నాల్గవసారి జత కట్టబోతున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. నాగార్జున చేతుల మీదుగా ఈ చిత్రాన్ని ప్రారంభించడం జరిగింది. నాగచైతన్య ఇప్పటికే రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు. ఆ రెండు చిత్రాలు విడుదలైన తర్వాత ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. ఇక సమంత కూడా ‘యూటర్న్’ చిత్రంలో నటించింది. ఆ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. వీరిద్దరు కూడా సెప్టెంబర్ వరకు బిజీగా ఉండబోతున్నారు. అందుకే అక్టోబర్లో వీరిద్దరి కాంబో మూవీని పట్టాలెక్కించబోతున్నాడు. కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. నానికి మంచి సక్సెస్ను ఇచ్చిన శివ నిర్వాన ఈ చిత్రంతో చైతూకు మంచి సక్సెస్ను కట్టబెడతాడేమో చూడాలి.