Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నవ్యాంధ్రను ఆటోమొబైల్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్రానికే తలమానికంగా భావిస్తున్న కియా కార్ల పరిశ్రమ ఇన్ స్టలేషన్ ను అనంతపురం జిల్లా పెనుకొండలో ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన చంద్రబాబు కియాకంపెనీకి భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. పనులు శరవేగంగా జరిగేందుకు సహకరించిన రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులను అభినందించారు. కియా మోటార్స్ కోసం త్వరితగతిన హంద్రీనీవా ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్టు వెల్లడించారు.
ప్రపంచంలోనే వాహన తయారీ రంగంలో కొరియా రెండో అతిపెద్ద దేశమని, ప్రపంచంలో అన్ని ప్లాంట్ల కంటే అనంతపురం ప్లాంటే అధికంగా ఉత్పత్తులు చేస్తుందని భావిస్తున్నామని చెప్పారు. అనంతపురం కియా ప్లాంట్ కు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, చెన్నై, కృష్ణపట్నం కారిడార్ అందుబాటులో ఉందని, ఈ సౌకర్యాలతో ఏడాదికి 10లక్షల కార్లు ఉత్పత్తి చేయాలని ఆకాంక్షించారు. కియా మోటార్స్ రాకతో అనంతపురం రూపురేఖలు మారిపోనున్నాయని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తంచేశారు. 2021నాటికి 21 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడం, పదివేల మందికి ఉద్యోగాలు కల్పించడం తమ లక్ష్యమని కియా మోటార్స్ సంస్థ అధ్యక్షుడు పార్క్ అన్నారు.
కియా మోటార్స్ సోదర సంస్థ హుందాయ్ ప్లాంట్ ను 1996లో చెన్నైలో ఏర్పాటుచేశామని, ఇప్పుడు ఏపీలో ఈ సంస్థ యూనిట్ కు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. కియా మోటార్స్ ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వ సహకారం మరువలేనిదని, ప్రజలు, అధికారులు చక్కగా సహకరిస్తున్నారని కొనియాడారు. తమ సంస్థ ద్వారా సామాజిక కార్యక్రమాలు కూడా చేపడతామన్నారు.