Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పార్లమెంట్ సమావేశాలు జరిగిన తీరుకు నిరసనగా… బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సహా బీజేపీ ఎంపీలతో కలిసి గురువారం ఒకరోజు నిరాహార దీక్ష చేయాలని ప్రధాని తీసుకున్న నిర్ణయంపై టీడీపీ తోపాటు ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్నాటకలో మోడీ ఈ దీక్ష చేయనుండడంపై మరింత ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. నిజానికసలు పార్లమెంట్ లో ఏం జరిగింది…? కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటిరోజు నుంచీ టీడీపీ ఎంపీలు ఉభయ సభల్లో ఆందోళనకు దిగారు. విభజన బాధిత ఏపీని న్యాయం చేయాలని, ప్రత్యేక హోదా సహా విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు సభా కార్యకలాపాలు అడ్డుకున్నారు. మలివిడత సమావేశాల్లోనూ ఈ ఆందోళన కొనసాగింది. అయితే కేంద్రప్రభుత్వం నుంచి బయటకు వచ్చి… టీడీపీ అవిశ్వాసం పెట్టిన తర్వాత… ఎంపీలు ఆందోళన విరమించారు. వైసీపీ ఎంపీలు కూడా అవిశ్వాసతీర్మానం నోటీసులిచ్చి….దానిపై చర్చ జరగాలని కోరారు.
ఇలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా… టీఆర్ఎస్… అన్నాడీఎంకె లోక్ సభలో ఆందోళనలు మొదలుపెట్టాయి. రిజర్వేషన్లు అమలు చేసే అధికారం రాష్ట్రాలకు కేటాయించాలంటూ టీఆర్ ఎస్ ఎంపీలు, కావేరీ బోర్డు ఏర్పాటుకోసం అన్నాడీఎంకె ఎంపీలు సభలో ఆందోళన నిర్వహించాయి. అవిశ్వాసంపై చర్చ జరిగేందుకు సహకరించాలని టీడీపీ, వైసీపీతో పాటు… కాంగ్రెస్… ఇతర పార్టీల ఎంపీలు కోరినా… టీఆర్ ఎస్, అన్నాడీఎంకె పట్టించుకోలేదు. దీంతో ఏ అంశంపైనా చర్చ జరగుకుండానే పార్లమెంట్ ఉభయసభలు ఇలా ప్రారంభమవడం, అలా వాయిదాపడడం జరిగింది. చివరకు టీఆర్ ఎస్ ఎంపీలు వెనక్కితగ్గినా… అన్నాడీఎంకె ఎంపీలు మాత్రం సభ నిరవధిక వాయిదా పడేదాకా ఆందోళనలు కొనసాగించారు. అవిశ్వాసతీర్మానాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక కేంద్రమే కావాలని టీఆర్ఎస్, అన్నాడీఎంకె ఎంపీలతో గొడవ చేయించిందన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణల్ని తిప్పికొట్టడంతో పాటు… పార్లమెంట్ సమావేశాలు జరగనీయలేదన్న నింద విపక్షాలపై వేసేందుకు మోడీ… నిరాహారదీక్ష మంత్రం ప్రయోగిస్తున్నారు. దీనిపై పలు పార్టీల నేతలు మండిపడుతున్నారు.
ముఖ్యంగా… మోడీ ప్రధానంగా నింద మోపాలని భావిస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దీక్షనిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. కేంద్రమే తప్పు చేసి… టీడీపీ తప్పు చేసినట్టు చిత్రీకరించేందుకు మోడీ దీక్ష చేస్తామనడం విడ్డూరంగా ఉందని చంద్రబాబు విమర్శించారు. మోడీ దీక్షపై ఏపీ ప్రజల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రధాని దీక్షకు నిరసనగా… ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ విజయవాడలో నిరసన దీక్ష చేపట్టాలని నిర్నయించారు. అటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా మోడీ దీక్షపై ట్విట్టర్ లో స్పందించారు. ఇది చాలా బాగుంది… కేవలం ఒక్కరోజు నిరాహార దీక్ష. అది కూడా ఆయనకు వ్యతిరేకంగా… అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. పార్లమెంట్ సమావేశాలు జరగకపోవడానికి ప్రధాని మోడీనే కారణమని ఆయన విమర్శించారు. ఇప్పుడేమో తనకు వ్యతిరేకంగా తానే నిరసన పేరుతో దీక్ష చేస్తానంటున్నారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వారం రోజుల తర్వాత ప్రధాని నిద్రలేచారంటూ… ఇప్పటికే కాంగ్రెస్ మోడీ పై విమర్శలు గుప్పించింది. ఇలా విపక్షాలు చేస్తున్న విమర్శలన్నింటికీ తన దీక్షతో సమాధానం ఇవ్వాలని మోడీ భావిస్తున్నారు.