Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు జరపకపోయినప్పటికీ… శాఖాపర కేటాయింపులలో మన సమర్థత చూపి రాష్ట్రానికి ఎక్కువ నిధులు రాబట్టుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తన నివాసంలో నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై జరిగిన టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ ద్వారా ఏ శాఖకు ఎన్ని నిధులు వచ్చే అవకాశం ఉందో అంచనాలు రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారు. కేంద్ర బడ్జెట్ లో కేటాయించినవి, సప్లిమెంట్ గా ఉన్నవి కలిపి నరేగాకు ఈ ఏడాది రూ. 65వేల కోట్ల బడ్జెట్ అందుబాటులో ఉంటుందని అధికారులు చెప్పగా… వాటిలో రూ. 7వేల కోట్ల నిధులు ఏపీ ఉపయోగించుకోవాలని సూచించారు. ఉపాధి కూలీలకు సకాలంలో వేతనాలు ఇవ్వాలని, పనిదినాల సంఖ్య 23కోట్లకు చేరుకోవాలని ఆదేశించారు. బడ్జెట్ లో క్షీరవిప్లవం, నీలి విప్లవానికి రూ. 10వేల కోట్లు పైబడి కేటాయించారని, ఈ నిధులను రాష్ట్రంలోని ఆక్వా రైతాంగం, పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మత్స్యరంగం, పశుసంవర్ధక రంగంలో మౌలిక సదుపాయాల మెరుగుకు ఈ నిధులు ఉపయోగించుకోవాలని, అన్ని జిల్లాలు పశుగ్రాసంపై దృష్టిపెట్టాలని, వేసవిలో పశుగ్రాసం కొరతలేకుండా చూసుకోవాలని ఆదేశించారు. మూడున్నరేళ్లలో అనేక పనులు చేశామని, ఈ ఏడాదిలో పనుల స్థిరీకరణ రావాలని, సంతృప్తం కావాలని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పుడు ఒక స్థాయికి చేరుకున్నామని, ఇకపై నిలకడ సాధించాలని వ్యాఖ్యానించారు. రాబోయే ఖరీఫ్ లో ఏ పంటలు సాగుచేయాలో ఇప్పటినుంచే దృష్టిపెట్టాలని, మేలు రకాలు సాగుచేయాలని, ఉత్పాదకత పెరగాలని, సాగు వ్యయం తగ్గాలని తద్వారా రైతుల నిజ ఆదాయాలు పెంచాలని కోరారు. గత రెండేళ్లలో వర్షపాతం లోటు తీవ్రంగా జల సంరక్షణ చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయని ముఖ్యమంత్రి చెప్పారు. ఎన్టీఆర్ గ్రామీణ లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు. ప్రతి నెలా ప్రతి పంచాయితీకి హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పోషకాహార లోపంపై గ్రామాల వారీగా ప్రజలను చైతన్యపరచాలని కోరారు.