వేడిక్కిన ఆంధ్రా : టీడీపీ సైకిల్, జనసేన పాదయాత్రలు

Chandrababu Cycle Yatra and Pawan Kalyan Padayatra in AP

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఏపీకి హోదా ఇస్తామని మాట మార్చి అన్యాయం చేసిన కేంద్రం మీద ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు భగ్గు మంటున్నారు. ఇదే అదనుగా తీసుకున్న రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని రాజకీయంగా కూడా వాడుకునేందుకు చూస్తున్నారు. ఇప్పటికే నాలుగేళ్ళు కలిసి నడిచిన తెలుగుదేశం బీజేపీ తో తెగదెంపులు చేసుకుని ప్రత్యక్ష పోరుకి సిద్ధం కాగా, వైకాపా కూడా పార్లమెంట్ లో తమ ఎంపీలతో ఆందోళనలు చేయిస్తోంది, ఇక ఇప్పుడు జన సేన కూడా హోదా కోసం ఉద్యమ బాట పట్టనుంది. ఈరోజు తెలుగు దేశం, జనసేనలు వేరువేరుగా యాత్రలకి పిలుపునిచ్చ్హాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని నియోజకవర్గాల్లో శుక్రవారం సైకిల్‌, మోటార్‌ సైకిల్‌ యాత్రలను టీడీపీ నిర్వహిస్తుండగా, ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని నియోజకవర్గాలలో సీపీఎం, సీపీఐలతో కలిసి జనసేన జాతీయ రహదారులపై పాదయాత్రని నిర్వహించనుంది.

తెలుగుదేశం సైకిల్ యాత్రని ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించి, ఆయన కూడా ఎమ్మెల్యేలతో కలిసి సైకిల్‌పై శాసనసభకు చేరుకుంటారు. ఇదిలా ఉండగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు మరో ప్రకటన కూడా చేశారు విభజన చట్టంలోని అంశాలు, హామీల అమలు కోసం పార్లమెంటు వేదికగా పోరాటం సాగించిన ఎంపీలంతా ఆత్మగౌరవ యాత్ర పేరుతో 13 జిల్లాల్లో త్వరలో బస్సు యాత్ర చేపడతారని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలోనూ ఒక బహిరంగ సభ నిర్వహిస్తారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన అనంతరం ఎంపీలతో శనివారం సమావేశమై ఈ యాత్ర విధివిధానాలు, ఆయా జిల్లాల పర్యటన తేదీలను సీఎం చంద్రబాబు ఖరారు చేస్తారు.

మరోవైపు ప్రత్యేక హోదా సాధన కోసం జనసేన చేతున్న పాదయాత్రలని విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద ఉదయం 10 గంటలకు సీపీఎం, సీపీఐ నాయకులతో కలిసి పవన్‌ కల్యాణ్‌ పాదయాత్రను ప్రారంభిస్తారు. ఏలూరు రోడ్‌ మీదుగా రామవరప్పాడు రింగ్‌ వరకూ ఈ యాత్ర సాగుతుంది. ఇదే సమయంలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ వామపక్షాలు, జనసేన పార్టీల నేతలు, కార్యకర్తలు జాతీయ రహదారులపై పాదయాత్రను చేపడతారు. అయితే ప్రత్యేక హోదా సాధన కోసం అధికార పార్టీ అదే విధంగా పవన్ పార్టీ రోడ్డు ఎక్కినా ప్రధాన ప్రతిపక్షమయిన వైసీపీ మాత్రం ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి పిలుపును ఇవ్వకపోవడం గమనార్హం. ఇక్కడే వైసీపీ – బీజేపీ బంధం బయట పడింది అని కొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు.