కడప జిల్లా జమ్మలమడుగు టీడీపీ పంచాయితీ ఒక కొలిక్కి వచ్చినట్టు చెబుతున్నారు కడప పార్లమెంట్, జమ్మలమడుగు అసెంబ్లీ స్థానాల విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఈ రెండు సీట్ల విషయంలో పోటీకి ఎవరిని నిలబెట్టాలన్నది సీఎం చంద్రబాబే నిర్ణయం తీసుకుంటారని నేతలు స్పష్టంచేశారు. ఈ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని అధినేత చంద్రబాబు నెలరోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఆ నియోజకవర్గానికి చెందిన మంత్రి ఆది, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు అసెంబ్లీ టికెట్ ఆశిస్తుండడంతో ఇప్పటికి నాలుగుసార్లు ఇరువురితో సీఎం చర్చలు జరిపారు. ఇద్దరు నేతల అనుచరులు, కుటుంబ సభ్యులు సీఎంను కలసి అసెంబ్లీ టికెట్టే కోరడంతో కేటాయింపు జాప్యమవుతూ వస్తోంది. ఇది ఓ కొలిక్కి వస్తే తప్ప మిగిలిన నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక సాధ్యం కాదన్నది అధినేత ఆలోచన. బుధవారం సాయంత్రం మంత్రి ఆది, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సీఎంను కలిసి చర్చించారు. మళ్లీ మొదటి మాటే రావడంతో ఆయన రాత్రి వరకు సమయమిస్తున్నా, ఈ లోగా మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకుని తెలియజేయండని సమయమిచ్చారు. ఎమ్మెల్సీ స్వల్ప అనా రోగ్యానికి గురి కావడంతో ఆయన రాత్రి సమావేశానికి హాజరు కాలేదు. తిరిగి గురువారం ఉదయం జరిగిన చర్చల్లో జిల్లాకు చెందిన ఎంపీ సీఎం రమేశ్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డితో పాటు మంత్రి ఆది, ఎమ్మెల్సీ పాల్గొన్నా రు.
ఈ భేటీ అనంతరం ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. వారం రోజుల్లో చంద్రబాబు తన నిర్ణయాన్ని చెబుతానని అన్నారని మీడియాకు వెల్లడించారు.అభ్యర్థి ఎంపిక అంశాన్ని అధినేతకే వదిలేశామని స్పష్టంచేశారు. ఎవరికి ఏ స్థానం కేటాయించినా కలిసి పనిచేస్తామని చెప్పారు. కడప జిల్లాలో అన్ని స్థానాలను కైవసం చేసుకుంటామని మంత్రి ఆదినారాయణరెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ఇదిలా ఉంటే జమ్మలమడుగు ఎమ్మెల్యేగా రామసుబ్బారెడ్డిని, కడప ఎంపీగా ఆదినారాయణరెడ్డిని బరిలోకి దింపాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులను తానే ప్రకటిస్తానని, గెలుపుకోసం అందరూ ఒక్కటిగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. మరో వారం తరువాత ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలో వెల్లడిస్తామన్నారు. రాయచోటి టికెట్ విషయం తేలకపోవడంతో సర్వే ప్రకారమే అభ్యర్థి ఎంపిక జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆది మాట్లాడుతూ రామసుబ్బారెడ్డితో కలిసి పనిచేయడం ఇబ్బందికరమే అయినా కార్యకర్తలను ఒప్పించే ప్రయత్నం చేస్తామని, అనుచరులు, కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని వత్తిడి చేస్తున్నారని చెప్పారు. ఇద్దరం కలిసి నియోజకవర్గంలో పర్యటిస్తే కేడరు కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే మరింత డ్యామేజీ అవుతుంది. అందుకనే నేనొక్కడినే వెళ్లి కార్యకర్తలు, అనుచరులతో మాట్లాడి ఒప్పిస్తానని అన్నారు.