Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మహానటిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. మహానటిని అద్భుతంగా తీర్చిదిద్దారని, సావిత్రి తన జీవితంలో పడిన కష్టాలకు మహానటి అద్దం పట్టిందని ముఖ్యమంత్రి కొనియాడారు. అమరావతిలోని ప్రజాదర్బార్ హాల్ లో మహానటి చిత్రబృందం చంద్రబాబును కలిసింది. సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరి, అల్లుడు గోవిందరాజులు, మహానటి హీరోయిన్ కీర్తిసురేశ్, నిర్మాతలు అశ్వనిదత్, స్వప్న, ప్రియాంక దత్ లు, దర్శకుడు నాగ్ అశ్విన్, కెమెరామెన్ డైన్, సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ ఈ బృందంలో ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయచాముండేశ్వరితో పాటు మహానటి చిత్రబృందాన్ని సన్మానించారు. సావిత్రి పాత్ర చేయడమంటే సాహసమేనని, సావిత్రి జీవితానికి సార్థకత తీసుకురావాలనే పట్టుదలతో ఈ సినిమాలో కీర్తిసురేశ్ చాలా బాగా నటించారని ప్రశంసించారు.
మహానటి సినిమాను చక్కగా తీసారని స్వప్న, ప్రియాంకలను చంద్రబాబు అభినందించారు. రెండు సంవత్సరాలు మహానటి జీవితాన్ని అధ్యయనం చేసి, మంచి సినిమా తీశారని దర్శకుడు నాగ్ అశ్విన్ ను మెచ్చుకున్నారు. చిత్ర బృందం ఎంతో సాహసంతో ఈ సినిమా తీసి మంచి విజయం అందుకుందన్నారు. హీరోల్లో ఎన్టీఆర్ ఎంత బాగా నటించేవారో… హీరోయిన్లలో సావిత్రి అంతే బాగా నటించేవారని, సావిత్రిది కూడా రాజధాని అమరావతిలోని గ్రామమే కావడం విశేషమని అన్నారు. కష్టాల్లో కూడా ఇతరులకు సహాయపడాలనే సావిత్రి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. మహానటికి పన్ను మినహాయింపుపై ప్రభుత్వ పరంగా ఆలోచన చేస్తామని సీఎం హామీఇవ్వగా… నిర్మాత అశ్వినీదత్ పన్ను మినహాయింపు ద్వారా వచ్చే మొత్తాన్ని రాజధాని నిర్మాణానికే ఇస్తామని చెప్పారు. వైజయంతి మూవీస్ తరపున రూ. 50లక్షల చెక్ ను రాజధాని నిర్మాణం కోసం స్వప్న దత్ ప్రకటించారు.