మ‌హిళ‌ల‌కు ఉచిత వైద్యం, ఉత్త‌మ పాల‌నః జన‌సేనాని హామీలు

Pawan Kalyan announces free Health Treatment for Ladies

జన‌సేన అధికారంలోకి వ‌స్తే… మ‌హిళ‌ల‌కు ఉచితంగా వైద్యం అందిస్తామ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ హామీఇచ్చారు. జ‌న‌సేన అధికారంలోకి వ‌చ్చాక ఉత్త‌మ పాల‌న చూస్తార‌ని ఆయ‌న చెప్పారు. ఉద్ధానం ప్రాంతంలో మూత్ర‌పిండాల స‌మ‌స్య‌పై త‌క్ష‌ణ‌మే ప్ర‌భుత్వం స్పందించాల‌ని డిమాండ్ చేస్తూ చేప‌ట్టిన నిరాహార దీక్ష‌ను సాయంత్రం ఐదుగంట‌ల‌కు ఆయ‌న విర‌మించారు. కిడ్నీ బాధిత కుటుంబ చిన్నారి ఇచ్చిన నిమ్మ‌ర‌సం తాగి ప‌వ‌న్ దీక్ష ముగించారు. ఉద్ధానం వెనుక‌బ‌డ్డ ప్రాంతం కాద‌ని, వెన‌క్కి నెట్ట‌బ‌డిన ప్రాంత‌మ‌ని ప‌వ‌న్ ఆరోపించారు. తాను దీక్ష చేసింది రాజ‌కీయ ల‌బ్ది కోసం కాద‌న్నారు. త‌న‌కు రాజ‌కీయ ల‌బ్ది కావాల‌నుకుంటే చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ఇచ్చేవాడిని కాద‌ని చెప్పారు. జ‌న‌సేన పోరాటం రాజ‌కీయ అధికారం కోసం కాద‌ని, సామాజిక స‌మ‌స్య‌లు రూపుమాపేందుకే అని తెలిపారు.

రాష్ట్రాన్ని మోసం చేసిన కేంద్రం, ఆ కేంద్రానికి మ‌ద్ద‌తిచ్చిన టీడీపీపై నిర‌స‌న‌గా ఆందోళ‌న చేప‌ట్టాన‌ని, సామాజిక‌, రాజ‌కీయ చైత‌న్యం కోసం జ‌న‌సేన పోటీచేస్తోంద‌ని వివ‌రించారు. రాజ‌కీయాల్లో మాన‌వ‌తా దృక్ప‌థం లోపించింద‌ని, తాను మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి ఆ దృక్ఫ‌థం తీసుకొస్తాన‌ని చెప్పారు. మ‌హిళ‌ల ఆరోగ్యానికి భ‌ద్ర‌త క‌ల్పించే బాధ్య‌త త‌న‌ద‌ని, మ‌హిళ‌లు ఆరోగ్యంగా ఉంటే… దేశాన్ని వాళ్లే బాగా చూసుకుంటార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. జ‌న‌సేన మ్యానిఫెస్టోలో మ‌హిళ‌ల‌కు ఉచిత వైద్యం కూడా ఉంటుంద‌న్నారు.

డాక్ట‌ర్ శ్రీధ‌ర్ ఇచ్చిన స‌ల‌హాలు, సూచ‌న‌ల‌పై అధ్య‌య‌నం చేస్తామ‌ని చెప్పారు. వెన‌క‌బాటు అనేది సామాన్య‌ప్ర‌జ‌ల‌కే ప‌రిమితం అవుతోంద‌ని, త‌మ‌కున్న జ‌బ్బులు కూడా గుర్తించ‌లేని పేద‌రికంలో ప్ర‌జ‌లు ఉన్నార‌న్నారు. విదేశీ యాత్ర‌ల‌కు, ఖ‌రీదైన హోట‌ళ్ల‌లో బ‌స చేయ‌డానికి డ‌బ్బులు ఉంటాయి కానీ, ఉద్ధానం బాధితులను ఆదుకోవ‌డానికి మాత్రం ఉండ‌వా అని నిలదీశారు. రూ. 2వేల కోట్లు పుష్క‌రాల‌కు ఖ‌ర్చుపెట్టిన వారు… జ‌బ్బుతో 20వేల మంది చ‌నిపోయిన చోట ఖ‌ర్చుపెట్ట‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక వేత్త‌ల‌ను స‌మావేశ‌పరిచి కార్పొరేట్ సామాజిక బాధ్య‌త కింద ఉద్దానం స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌వ‌చ్చ‌ని ప‌వ‌న్ సూచించారు.